ప్రభుత్వానికి ముఖ్య సలహాదారు చంద్రబాబే

గుడివాడ, 08 ఏప్రిల్ 2013:

ఇది దివంగత మహానేత  రెక్కల కష్టమ్మీద అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తప్ప ఆయన విధానాలు అనుసరిస్తున్నది కాదని శ్రీమతి వైయస్ షర్మిల విమర్శించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకూ, దానికి వంత పాడుతున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ వైఖరికి నిరసనగా చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారం నాడు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా ఆమె జొన్నపాడు గ్రామంలో రచ్చబండ నిర్వహించారు. జొన్నపాడు ప్రముఖ నక్సలైట్ ఉద్యమ నాయకుడు కొండపల్లి సీతారామయ్య  స్వగ్రామం. రచ్చబండలో ఆమె మాట్లాడుతూ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. మహానేతను ఏమాత్రం అర్థం చేసుకోలేదన్నారు.  చంద్రబాబునాయుడు ఆయనకు ఆదర్శం. ఈ ప్రభుత్వానికి చంద్రబాబే ముఖ్య సలహాదారని శ్రీమతి షర్మిల  చెప్పారు. చంద్రబాబుకు కావాల్సింది స్వప్రయోజనాలేనని, ప్రజలు ఏమైపోయినా ఆయనకు పట్టదని దుయ్యబట్టారు.  రచ్చబండ కార్యక్రమంలో ఆమె మహిళలు, రైతుల సమస్యలు విన్నారు. వారితో మాట్లాడారు. శ్రీమతి షర్మిల ఏమన్నారో ఆమె మాటల్లోనే..

బాబు పాలనకు ఇది కొనసాగింపు..

‘చంద్రబాబు హయాంలో వర్షాల్లేక.. పంటలు పండక తొమ్మిదేళ్ల కరువొచ్చింది. సాయం చేసేవారు లేక లక్షలాది మంది ఇళ్లను వదిలి పొట్టకూటి కోసం ఎక్కడెక్కడికో వలసలు వెళ్ళారు. అప్పుల బాధలు తట్టుకోలేక వేలాది మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు అదే పరిపాలన మళ్లీ వచ్చింది, చంద్రబాబు పాలనకు కొనసాగింపుగా కిరణ్‌కుమార్‌రెడ్డి పరిపాలిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులను పురుగుల్లా చూశారు. వ్యవసాయం దండగన్నారు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్కలు వేసి చూపించారు. వేలకు వేలు కరెంటు బిల్లులు వేసి రైతులను, పల్లెలను పీల్చి పిప్పి చేసిన ఆయన ఇప్పుడు ‘వస్తున్నా మీకోసం’ అంటూ పల్లెల వెంట తిరుగుతున్నారు. పాదయాత్ర చేస్తున్నారు కదా..! ప్రజా సమస్యలు అర్థం చేసుకుంటారు.. రైతులకు, రైతు కూలీలకు అండగా నిలబడతారనుకున్నాం. ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి కూలగొడతారని అనుకున్నాం. కానీ ఆయనకు ప్రజా ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే ముఖ్యం. ఆయనకు కావాల్సింది రాజకీయాలు. ఆయన ఏ పని చేసినా రాజకీయంగానే ఆలోచన చేస్తారు. ఎంతటి నీచానికైనా దిగజారుతారు. రైతులు ఏమైపోయినా ఆయనకు పట్టదు. ఆ రోజు అధికారం కోసం పిల్లనిచ్చిన సొంత మామనే వెన్నుపోటు పొడిచారు. ఈరోజు తన అవినీతి పనుల మీద సీబీఐ విచారణ తప్పించుకోవడానికి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు నాయుడే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజానికెత్తుకొని మోస్తున్నారు. ఆయన పాదయాత్ర ప్రజల కోసం కాదు. ఆయన కోసం.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించడం కోసం...’

ఆదివారం 114వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం కేంద్రంలోని ఏలూరు రోడ్డు నుంచి ప్రారంభమైంది. శ్రీమతి షర్మిల మొత్తం 6 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1552.1 కి.మీ యాత్ర పూర్తయ్యింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యే కొడాలి నాని, కుక్కల నాగేశ్వర్‌రావు, ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ మంత్రులు జ్యోతుల నెహ్రూ, కటారి ఈశ్వర్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ముసునూరు రత్నబోసు తదితరులున్నారు.

Back to Top