ప్రభుత్వానికీ హాలిడే ప్రకటించాలి

హైదరాబాద్:

పాడి పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి  విమర్శించారు. ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగానూ ఉపయోగపడటం లేదని  వారు ఆరోపించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం వారు విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. అధికారమే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికే క్రాప్ హాలిడే, పవర్ హాలిడేలు ప్రకటించిందన్నారు. ఈ కారణంగా తమకు అందుబాటులో ఉన్న పాడి పరిశ్రమపై ఆధారపడదామనుకున్న గ్రామీణులకు పాల హాలిడే ప్రకటించాలనుకున్న ప్రభుత్వ నిర్ణయం శరాఘాతమైందన్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి హాలిడే ప్రకటించే సమయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. పాడి రైతును ఆదుకోకుంటే తమ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని ఆయన హెచ్చరించారు. పాల సేకరణ ధరను పెంచాలని వారు డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై చర్చిద్దామంటే అసెంబ్లీలో ప్రభుత్వం పారిపోయిందని ఎద్దేవా చేశారు. వివిధ సమస్యలపై తమ పార్టీ ఎన్నో ఉద్యమాలు చేసిందన్నారు.
     
 ఎక్కువగా ఉంటే పాల హాలిడే ప్రకటిస్తారా
  
    
     పాలు ఎక్కువగా ఉన్నాయని పాడి పరిశ్రమలకు హాలిడే ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. పాల ధర లీటరు 20 లేదా 22 రూపాయలు ప్రకటించి, వారిని ఆదుకోవాలని కోరారు. నష్టాల్లో ఉన్న విజయ డెయిరీకి ఆర్థిక సహాయం చేసి, ఆదుకోవాలని కోరారు. ప్రస్తుతం రైతులను బతకనిచ్చే పరిస్థితి కనిపించడంలేదు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ మహిళలకు ఉపయోగపడేలా పశుక్రాంతి పథకాన్ని ప్రవేశపెట్టారనీ, రుణాలిచ్చి, ఆవులను గ్రామీణ మహిళలకు ఇచ్చారని చెప్పారు. ఆ నిర్ణయాలకు ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు. పేద ప్రజలకు సంబంధించిన రంగాలను వైయస్ఆర్ అభివృద్ధి చేశారు. పల్లె ప్రజల ఇక్కట్లు ఎందుకు పట్టడం లేదో ప్రభుత్వానికి పట్టడం లేదు. గ్రామీణ ప్రాంతాలలో మహిళలు పసుపు తాడు కూడా కట్టుకోలేని స్థితికి చేరారు.  
    
    ప్రస్తుత నేతలు తమది పేదల ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. కంటి తుడుపు చర్యగా సాయం చేసి గొప్పగా చెప్పుకుంటున్నారు. నీలం తుపానులో నష్టపోయిన పంటలకు హెక్టారుకు పదివేల రూపాయల సాయం ప్రకటించారనీ, మహానేత డాక్టర్ వైయస్ఆర్ జీవించి ఉండి ఉంటే ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చేవారని చెప్పారు. ప్రజాసమస్యలపై స్పందించాలని చంద్రబాబును డిమాండ్ చేశారు.  ఎఫ్‌డీఐల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంతో టీడీపీ కుమ్మక్కయ్యిందని ఆరోపించారు.

చిత్తూరు డెయిరీ మూతపడేవరకూ బాబు నిద్రపోలేదు
 
     ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన హెరిటేజ్ డెయిరీ అభివృద్దికి చిత్తూరు డెయిరీ మూతపడే వరకూ నిద్ర పోలేదని వారు ఆరోపించారు. 1960 దశకంలో చిత్తూరు డెయిరీ రోజుకు ఆరు వేల లీటర్లు సేకరించేదనీ, దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందనీ వారు వివరించారు. అలాంటి డెయిరీని చంద్రబాబు తన స్వార్థం కోసం నాశనం చేశారు ఆవేదన వ్యక్తంచేశారు.


అసెంబ్లీనుంచి పారిపోయిన ప్రభుత్వం

     ఈ నెల పదో తేదీనుంచి అసెంబ్లీ సమావేశాలుంటాయని చెప్పిన ప్రభుత్వం  పారిపోయిందని ఎద్దేవా చేశారు. ఎస్సీ,ఎస్టీ బిల్లుపై మూడు రోజుల పాటు జరిగిన సమావేశాలకు తమ పార్టీ పూర్తిగా సహకరించిందని చెప్పారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తోందన్నారు. స్పీకరు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు అడిగారు. ఏడాదిలో వంద రోజులు జరగాల్సిన సమావేశాలు ముపై రోజులు కూడా జరగలేదు. ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని స్పష్టంచేశారు. సమావేశాలు ఇక ఉండవని సభలోనే చెపితే సరిపోయేదని వారు తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top