ప్రభుత్వాధికారిని నిలదీసిన షర్మిలదాడితోట

24 అక్టోబర్ 2012 : చిత్రావతి రిజర్వాయరను సందర్శించిన షర్మిల పులివెందుల నియోజకవర్గానికి నీరు అందించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పై నుండి వచ్చే ఆదేశాల మేరకే తాము నడుచుకుంటున్నామని అక్కడి ఇరిగేషన్ అధికారి చెప్పడంతో షర్మిల మండిపడ్డారు. వైయస్ఆర్‌ జిల్లా అని కక్ష కట్టి ఇలా చేయమంటూ పై నుండి ఆర్డర్లేమీ లేవా? అని ఆమె అక్కడున్న డీఈని నిలదీశారు. "మీకు నిజాయితీ ఉండాలి.భగవంతుడు చూస్తుంటాడు. మాకు ఆత్మహత్యలు తప్ప మరో మార్గం లేకుండా పోయిందని రైతులు అంటున్నారు. అలా జరిగితే అది మీ బాధ్యత కాదా? జనం చనిపోయినా మీకు అక్కర్లేదా? ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యం"అని షర్మిల  దుయ్యబట్టారు. 'అంటే చంద్రబాబు హయాంలో కంటే అధికంగా ఇప్పుడు రైతులు, ప్రజలు ఆత్మహత్య
చేసుకోవాలని ఈ ప్రభుత్వ ఉద్దేశమా?’ అని ప్రశ్నించారు. ‘సాధ్యం అయినంతవరకు
వనరులను బట్టి చేస్తున్నాం' అని అధికారి బదులిచ్చారు. ఈ వైఖరిని వైయస్ఆర్ సీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆమె  ఆగ్రహంగా అన్నారు.
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు 4.4 టిఎంసీల నీరు విడుదల కావాల్సి ఉంది. అయితే సాగునీటి సలహా మండలి పులివెందులకు 2.6 టిఎంసిల నీటిని కేటాయించింది. కానీ నిజానికి వస్తున్నవి 0.6 టిఎంసీల నీరేనని వైయస్ఆర్ సీపీ నాయకులు షర్మిలకు వివరించారు. రెండు మూడు చోట్లలింకులు పూర్తి చేస్తే చాలు చిత్రావతికి నీరందుతుందనీ, ఈ ప్రభుత్వం ఆ పని కూడా చేయడం లేదని వారు ఫిర్యాదు చేశారు. పులివెందులకు తాగునీటి కోసం 1.5 టీఎంసీల నీరిస్తానని చెప్పిన అధికారులు ఆ మేరకు నీళ్లు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు.
నేర్జాంపల్లి దాటాక మార్గం మధ్యలో ఉన్న గండికోట-చిత్రావతి ఎత్తిపోతల పథకం
వద్ద షర్మిల ఆగి, రైతులతో మాట్లాడారు. స్థానిక నేత వైఎస్
అవినాశ్ రెడ్డి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు వివరాలు తెలిపారు. అనంతరం
షర్మిల స్పందిస్తూ, శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను గండికోట-చిత్రావతి
ఎత్తిపోతల పథకం ద్వారా చిత్రావతి రిజర్వాయర్‌కు తెచ్చేందుకు వైఎస్ తాను
చనిపోయేనాటికి 90 శాతం పనులు పూర్తి చేస్తే.. ఆయన చనిపోయిన మూడేళ్లలో ఈ
ప్రభుత్వం కనీసం రాయి కూడా కదపలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
'ఈ పథకం
పూర్తయితే చిత్తూరు జిల్లా నగరి వరకు నీళ్లొచ్చే అవకాశం ఉందట. కానీ ఆ
చిత్తూరులో పుట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈ పథకం పూర్తిచేయాలని ఎందుకు
లేదు? అక్కడే పుట్టిన చంద్రబాబు ఈ పథకం ఎందుకు పూర్తిచేయటంలేదని ఎందుకు
నిలదీయలేదు? రాజశేఖరరెడ్డి పుట్టిన జిల్లా అంటే అంత కక్షా? ఈ నిర్లక్ష్యం, ఈ
రాక్షస పాలన కొనసాగడానికి ఇక వీల్లేదు. ఇంతమందికి అన్నంపెట్టే ఈ
ప్రాజెక్టుకు అన్యాయం చేసే ఈ ప్రభుత్వం ఎంతో కాలం నిలవదు. జగనన్న సీఎం అయిన
ఒకటి, రెండు నెలల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తిచేస్తారు' అని ఆమె హామీ ఇచ్చారు.
కేవలం 45 కోట్లు ఖర్చు చేస్తే చాలు, హంద్రీ-నీవా మొదటి దశ పనులు పూర్తి అవుతాయనీ, అయినప్పటికీ మూడేళ్లుగా ఈ ప్రభుత్వం దానిని పట్టించుకోవడం లేదనీ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్ జలయజ్ఞం కింద యాభై వేల కోట్లు ఖర్చు చేయగా, చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేశారనీ ఆమె విమర్శించారు. బాబు తన మనసులో మాట పుస్తకంలో వ్యవసాయం దండగ అని రాసుకున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలు పట్టకుండా కిరణ్, చంద్రబాబు నువ్వెక్కువ నిద్రపోతావా, నేనెక్కువ నిద్రపోతానా అని పోటీలు పెట్టుకున్నట్లుందని షర్మిల అవహేళన చేశారు. హంద్రీ-నీవా పూర్తయితే స్థానికంగా భూగర్భజలాలు పెరుగుతాయని ఆమె అన్నారు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించే అవకాశం ఉన్నా, చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం పెట్టకుండా కాపాడుతున్నారని ఆమె విమర్శించారు. పైగా పాదయాత్రలంటూ నాటకాలు ఆడుతున్నారని ఆమె నిప్పులు చెరిగారు. మరికొన్నాళ్లు ఓపిక పడితే జగనన్న నాయకత్వంలో రాజన్న రాజ్యం వస్తుందని ఆమె ప్రజలకు భరోసా ఇచ్చారు.
అనంతరం జలాశయం సమీపంలో భోజనానికి ఉపక్రమించారు. తిరిగి సాయంత్రం 3.45కు అక్కడి నుంచి బయలుదేరి అనంతపురం జిల్లా సరిహద్దులోకి చేరుకున్నారు.
అనంతపురం జిల్లా దాడితోట గ్రామ సమీపంలోని రత్నమ్మ అనే రైతుకు చెందిన టమాట తోట ఎండిపోవడంతో అక్కడ ఆగారు. ఇప్పటికే రెండు లక్షల అప్పు ఉందని, ఇప్పుడు టమాట తోట ఎండిపోయి నష్టపోయామని, బోరు ఎత్తిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని రత్నమ్మ వాపోయారు. ఇప్పుడు వరిపొలం కూడా ఎండిపోయే పరిస్థితి ఉందని వివరించారు. 'చిత్రావతికి ఇంత సమీపంలో రైతు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈప్రభుత్వానికి మనసే లేదు' అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.
టమాటాను రైతు 2 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఉందని అని రైతులు వివరించగా జగనన్న సీఎం కాగానే రాష్ట్రంలో ఇప్పుడున్న 40 లక్షల చదరపు అడుగుల నిల్వ సామర్థ్యానికి అదనంగా మరో 40 లక్షల చదరపు అడుగుల నిల్వ సామర్థ్యం పెంచుతారని షర్మిల హామీ ఇచ్చారు. అక్కడి నుంచి దాడితోటకు వచ్చి సాయంత్రం 5.40కి అక్కడి బహిరంగ సభలో మాట్లాడారు. రాత్రి 7.45కు దాడితోట శివారులో రాత్రి బసకు చేరుకున్నారు. ఆరో రోజైన మంగళవారం మొత్తం 15.1 కిలోమీటర్లు నడిచారు. వైఎస్సార్ జిల్లాలో 7.3 కిలోమీటర్లు, అనంతపురం జిల్లాలో 7.8 కిలోమీటర్లు నడిచారు.

తాజా వీడియోలు

Back to Top