ఆ ముగ్గురు ప్రభుత్వ తొత్తులు

  • టీడీపీపై రోజురోజుకూ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది
  • వైయస్ జగన్ కు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేక టీడీపీ కుట్రలు
  • ప్రజాసేవకులన్న విషయం మర్చిపోయి పోలీసులు చట్టవ్యతిరేక చర్యలు
  • తప్పుడు కేసులు బనాయించిన వారికి తగిన గుణపాఠం తప్పదు
  • వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
గుంటూరుః టీడీపీపై రోజురోజుకు ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, వైయస్ జగన్ పై పెరుగుతున్న ఆదరణ చూసి చంద్రబాబు సర్కార్ ఓర్వలేకపోతుందని వైయస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోందన్నారు. ప్రజలు స్మార్ట్ ఫోన్స్ ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న నేపథ్యంలో...భయానక వాతావరణం సృష్టించే దురుద్దేశ్యంతో బాబు సోషల్ మీడియాపై గత ఆర్నెళ్లుగా ఉక్కుపాదం మోపుతున్నారని ఫైర్ అయ్యారు. నలుగురు, ఐదుగురిని అరెస్ట్ చేస్తే భయపడిపోతారు, సోషల్ మీడియాను కట్టడి చేయోచ్చన్న భావనలో చంద్రబాబు ఉన్నారని తూర్పారబట్టారు. పోలీసు అధికారులు నాయక్, యోగానంద్, అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్లు ప్రభుత్వ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  ప్రజాసేవకులన్న విషయం మర్చిపోయి చట్టానికి వ్యతిరేకంగా తప్పుడు కేసులు బనాయిస్తూ...వైయస్సార్సీపీ కార్యకర్తలను, అభిమానులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు సబ్ జైల్లో పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ ను విజయసాయిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. 

అధికారం శాశ్వతం కాదు..అధికారులు అధికారులు గానే ప్రవర్తించండి, ప్రభుత్వాలు వస్తాయి పోతాయని పదేపదే చెప్పినా వారు వినడం లేదన్నారు. అన్నీ గమనిస్తున్నామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తప్పుడు చర్యలకు పాల్పడుతూ, మా వాళ్లను ఎవరైతే జైల్లో పెడుతున్నారో రెండేళ్ల తర్వాత వారికి అదే గతి పడుతుందని హెచ్చరించారు. తమ సపోర్టర్ రవికిరణ్ కార్టూన్ వేశాడని చెప్పి, తప్పుడు కేసులతో  అతన్ని జైల్లో పెట్టడం సరికాదన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలోనూ కార్టూన్ లు వచ్చాయి. మరి అలాంటప్పుడు వారిని అరెస్ట్ చేస్తున్నారా...?అని నిలదీశారు.   రవికిరణ్ మీద పోలీసులు అటెంప్ట్ రేప్ కేసు పెట్టడంపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు.  ఆ పోలీసు అధికారికి అసలు బుద్ధి ఉందా..? చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. తమ సపోర్టర్స్ కు పూర్తి మద్దతిస్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పారు. ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. 
Back to Top