ముడుపుల కోసమే పోలవరం

  • పోలవరం నిర్మాణానికి వైయస్‌ఆర్‌సీపీ అడ్డు కాదు
  • వైయస్‌ఆర్‌ హయాంలోనే పోలవరానికి అంకురార్పణ
  • ప్రతిపక్ష నేతగా, ఎంపీగా కేంద్రంపై యుద్ధం ప్రకటించిన వైయస్‌ జగన్‌
  • కోర్టులో కేసులు వేసింది, పోలవరానికి వ్యతిరేకంగా పాదయాత్రలు చేసింది టీడీపీనే
  • పోలవరానికి నాబార్డు అప్రూవల్‌ ఎంత? ఇచ్చింది ఎంత?
  • రివైజ్డ్‌ ఎస్టీమేషన్ల కోసం కేంద్రాన్ని ఒప్పించారా?
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్‌కు వరప్రసాదిని అయిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం మూడుపుల కోసం ఉపయోగించుకుంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి విమర్శించారు. నిన్న నాబార్డు నుంచి పొందిన రుణంలో ఎంత సంపాదించుకోవాలన్నదే టీడీపీ నేతల ఆలోచన అని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పాటికి పోలవరం నిర్మాణం పూర్తి అయ్యేదని, ఈ మూడేళ్లలో 5 నుంచి 10 శాతం కూడా పురోగతి సాధించలేదని మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్థసారధి మీడియాతో మాట్లాడారు. 

పోలవరం నిర్మాణం కోసం 1940 నుంచి ఎందరో ప్రయత్నించారని, ఆ తరువాత ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని, ఎందరో ముఖ్యమంత్రులు మారిపోయారన్నారు. అయితే పోలవరం కార్యారూపం దాల్చలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక పోలవరం నిర్మాణానికి అంకురార్పణ జరిగిందని, దశాబ్దాల కాలంగా అటకెక్కిన అనుమతులను తెచ్చింది మహానేతే అని పార్థసారధి గుర్తు చేశారు. అంతే కాకుండా పోలవరం రైట్, లెప్ట్‌ కెనాల్‌ నిర్మించారని తెలిపారు. ఇప్పుడు రాయలసీమ మీద ప్రేమ ఒలకబోస్తున్న టీడీపీ నేతలు నాడు పోలవరం నిర్మాణాన్ని అడ్డుకున్నారని మండిపడ్డారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు కోర్టుల్లో కేసులు వేశారని, నేటి నీటిపారుదలశాల మంత్రి దేవినేని ఉమా నాడు పాదయాత్ర చేసి పోలవరానికి అడ్డుపడ్డారని తెలిపారు. 

మేం సహకరిస్తాం
టీడీపీ ప్రభుత్వం పోలవరాన్ని చిత్తశుద్ధితో నిర్మించేందుకు ముందుకు వస్తే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సహకరిస్తుందని పార్థసారధి స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంభిస్తూ, రెండు నాల్కల ధోరణిలో ఉన్నారని విమర్శించారు. జాతీయ హోదా కలిగిన పోలవరాన్ని నిర్మించే బాధ్యత కేంద్రానిదే అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకోవడమే కాకుండా, రివైజ్డ్‌ ఎస్టీమేషన్లు పెంచుకొని దోపిడీకి తెర తీసిందన్నారు. పోలవరంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, చేస్తున్న పనులకు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు.  నిన్న ఢిల్లీలో నాబార్డు రుణం రూ.1981 కోట్లు పొందామని మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకొని..ఏపీకి వచ్చి పోలవరానికి వైయస్‌ జగన్‌ అడ్డుపడుతున్నారని చంద్రబాబు పేర్కొనడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. అసలు పోలవరం నిర్మాణంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? లేదా అన్నదే మా అనుమానమన్నారు. 

నాబార్డు రుణంలో ఎంత దోచుకుందామన్న వ్యవహార శైలి టీడీపీ నేతల్లో కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయ్యిందని, ఈ మూడేళ్లలో పోలవరానికి కేటాయించింది అంతంత మాత్రమే అన్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరం బాధ్యత కేంద్రానికి కాగా, వాళ్లు 2014 నాటికి ముందు ఖర్చు చేసిన నిధుల్లో కోత విధిస్తే చంద్రబాబు నిలదీయడం లేదన్నారు. మూడేళ్ల వ్యవధిలో 10 శాతం కూడా పురోగతి సాధించని ప్రాజెక్ట్‌ను మరో రెండేళ్లలో ఎలా పూర్తి చేస్తారని పార్థసారధి నిలదీశారు. రివైజ్డ్‌ ఎస్టీమేషన్ల కోసం కేంద్రాన్ని ఒప్పించారా అని ప్రశ్నించారు. ఇందులో కేంద్రం ఎంత ఇస్తుందని, మీరు బడ్జెట్‌లో ఎంత కేటాయిస్తారని నిలదీశారు. 

బాధితులను ఓదార్చడం తప్పా?
పోలవరం ముంపు ప్రాంతాల్లో బాధితులను ప్రతిపక్ష నాయకుడిగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఓదార్చడం తప్పా  అని పార్థసారధి ప్రశ్నించారు. ప్రజలకు ప్రతిపక్షాలు అండగా ఉంటాయని గుర్తు చేశారు. అలా ఉండకూడదా అని నిలదీశారు. ప్రభుత్వ అవినీతిని బజారున పెట్టే బాధ్యత ప్రతిపక్షానిదే అన్నారు. నష్టపోయిన బాధితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం పరిహారం పంపిణీలో వివక్ష చూపడంతో బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారని, సర్కార్‌ తీరుతో రైతుల మధ్య గోడవలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. పట్టిసీమ నిర్వాసితులకు ఎలాంటి పరిహారం ఇచ్చారో అలాగే పోలవరం బాధితులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ కోసం ప్రతిపక్ష నాయకుడిగా, నాటి ఎంపీగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కేంద్రంపై యుద్ధం ప్రకటించారని గుర్తు చేశారు. పోలవరం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే మేం అన్నివిధాల సహకరిస్తామని, అవినీతికి పాల్పడితే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ చూస్తూ ఊరుకోదని పార్థసారధి హెచ్చరించారు.
 
Back to Top