'పిల్ల కాంగ్రెస్' దెబ్బ మళ్ళీ తినాలని ఉందా?

విజయవాడ‌ : 'పిల్ల కాంగ్రెస్‌' అంటూ తక్కువగా మాట్లాడుతున్న టిడిపికి మరోసారి దాని దెబ్బ రుచి చూడాలని ఉందా? అని వైయస్‌ఆర్‌సిపి కృష్ణాజిల్లా కన్వీనర్‌ సామినేని ఉదయభాను హెచ్చరించారు. ఇంతకు ముందు జరిగిన ఎన్నికల్లోను, ఉప ఎన్నికల్లో కూడా చావు దెబ్బ తిన్నా టిడిపి నాయకుడు దేవినేని ఉమా మహేశ్వరరావుకు గుణపాఠం రాలేదా? అని ఆయన ఎద్దేవా చేశారు. త్వరలో జరగబోయే సహకార సంఘం ఎన్నికల్లో 'పిల్ల కాంగ్రెస్' ‌ధాటికి ఎలా నిలబడాలో ఆలోచించుకోవాలని సూచించారు.

తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు వైయస్‌ఆర్‌సిపిని పిల్ల కాంగ్రెస్‌ అని వ్యాఖ్యానించడాన్ని ఉదయభాను ఖండించారు. దమ్ముంటే 425 సహకార సంఘాలకు పోటీచేయాలని ఉమ అనడంపై భాను తీవ్రంగా ప్రతిస్పందించారు. జిల్లాలో అన్ని సహకార సంఘాలకు తమ పార్టీ పోటీచేస్తుందని విజయవాడలోని హొటల్‌ ఐలాపురంలో గత డిసెంబర్‌ 10న నిర్వహించిన 'సహకార భేరి'లోనే స్పష్టం చేశామన్నారు. అయితే, ఇప్పుడు ఉమ దమ్ముంటే పోటీ చేయాలనడాన్ని చూస్తే ఆయనకు మతి భ్రమించిందేమో అన్నారు.

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీని పిల్ల కాంగ్రెస్‌గా అభివర్ణించడం దేవినేని ఉమ అజ్ఞానానికి నిదర్శనమని సామినేని అన్నారు. ఇటీవల జరిగిన 18 ఉప ఎన్నికల్లో టిడిపికి ఒక్క సీటు కూడా రాని విషయం ఆయనకు ఎందుకు గుర్తు లేదో అన్నారు. అదే ఎన్నికల్లో పిల్ల కాంగ్రెస్ 16 సీట్లు గెల్చుకున్న విషయం మరచిపోయారా? అని ప్రశ్నించారు. ఉప ఎన్నికల మాదిరిగనే సహకార సంఘం ఎన్నికల్లోనూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టేందుకు రైతు సోదరులు సిద్ధంగా ఉన్నారని సామినేని ఉదయభాను అన్నారు.
Back to Top