పిచ్చి మాటలు ఆపకపోతే గుణపాఠం తప్పదు

గుంటూరు : టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిచ్చిమాటలు ఆపకపోతే ప్రజలు తరిమికొడతారని వైయస్‌ఆర్‌సిపి నాయకులు హెచ్చరించారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరిత, పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖ‌ర్ బుధవారం‌నాడు విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు గుంటూరు జిల్లాలో చేస్తున్న పాదయాత్రలో తమ పార్టీ వాడుతున్న పదజాలం అభ్యంతరకరంగా ఉందన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో అధికారం అనుభవించిన చంద్రబాబు మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిపై విమర్శలు ‌చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందన్నారు.

చంద్రబాబు డిక్షనరీలో నీతి, నిజాయితీ అనే పదాలకు అర్థం వేరని వారు విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థ చంద్రబాబు సిఎం అయ్యాకే భ్రష్టు పట్టిందని, టిక్కెట్లు అమ్ముకోవడం నుంచి అన్నిరకాల అవకతవకలకు కారకుడైన బాబును చూసి నిజాయితీ గలవారు ఎవరైనా సిగ్గుతో తలవంచుకోవాల్సిందేనన్నారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలని‌ వైయస్‌ఆర్‌సిపి నాయకులు డిమాండ్ చేశారు.

వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు రావి వెంకటరమణ మాట్లాడుతూ, మహానేత డాక్టర్ వైయస్‌ఆ‌ర్‌ను ప్రజలు దేవుడిలా చూసుకోబట్టే అన్ని విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు. 2004, 2009 ఎన్నికల్లో చంద్రబాబును రాష్ట్ర ప్రజలు పక్కకు నెట్టారని, దానికి ప్రజల్ని కూడా నిందించడం సరికాదన్నారు. చంద్రబాబు ఇంకా ఇదేవిధంగా మాట్లాడితే గ్రామాల్లో తిరగనివ్వరని, రాళ్ళతో కొట్టే పరిస్థితులు కూడా వస్తాయని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
Back to Top