ప్రజల గొంతు నొక్కుతున్న చంద్రబాబు

ఏ ప్రయోజనంతో రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు
బీజేపీని విమర్శించవద్దనడంలో ఆంతర్యమేంటి 
హోదాపై పోరాడేశక్తిని ఎందుకు అడ్డుకుంటున్నారు
ఏ సహాయం చేయమని కేంద్రం తెగేసి చెబుతోంది
రాష్ట్రానికి ఇంతకన్నా నష్టం ఇంకా ఏం జరగాలి బాబు
ఉమ్మడి ఉద్యమానికి కలిసివస్తారా లేదా
టీడీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన వాసిరెడ్డి పద్మ

హైదరాబాద్ః రాష్ట్రానికి హోదా గానీ, ఎలాంటి రాయితీలుగానీ  ఇవ్వమంటూ కేంద్రం తెగేసి చెబుతుంటే...పోరాడకుండా చంద్రబాబు ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నారో సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఇంతగా అన్యాయం జరుగుతుంటే...కేంద్రాన్ని ఎవరూ విమర్శించవద్దంటూ చంద్రబాబు మాట్లాడడం దారుణమన్నారు. హోదా కోసం పోరాడరు, పోరాడేవాళ్ళ కాళ్లు పట్టుకొని లాగుతున్నారంటూ బాబుపై ధ్వజమెత్తారు. ఏపీ ప్రజల ప్రాణవాయువైన హోదా గురించి కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని బాబును ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారా, మీ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని బాబును హెచ్చరించారు. హోదాపై ఉమ్మడిగా ఉద్యమం కొనసాగించేందుకు ముందుకు వస్తారో లేదా తేల్చుకోవాలన్నారు.  హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పద్మ మాట్లాడారు. 

కేంద్రం నుంచి ఎలాంటి సహాయం ఉండదని ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నారు. హోదా గానీ, రాజధానికి , భూములిచ్చిన రైతులకు ఎలాంటి రాయితీలుగానీ ఉండవని  తేల్చిచెప్పారు. ఐనా కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడవద్దనడంలో ఆంతర్యమేంటో చెప్పాలని  పద్మ బాబును నిలదీశారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై నోరెత్తవద్దని మాట్లాడే హక్కు బాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఏపీలో పెట్టుబడులకు తగిన వాతావరణం లేదు. రాయితీలు లేవు. హోదా ఉంటే ఈపాటికి  పారిశ్రామికవేత్తలు రెక్కలు గట్టుకొని వచ్చేవాళ్లు. పెట్టుబడులు వచ్చేవి, ఉద్యోగం వస్తుందన్న భద్రత ఉండేది. హోదా లేకపోవడంతో యువత దిక్కుతోచని పరిస్థితిలో ఉందని పద్మ వాపోయారు.  రాష్ట్రంలో ఇంతకుమించిన నష్టం ఏం జరగాలి. ఇంకా నష్టం జరిగితే గానీ స్పందించరా అంటూ బాబుపై పద్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

నిండా మునిగామని తెలిసి కూడా  బాబు ఎందుకు వెనకాడుతున్నారని, ఏ అజెండాతో ఏపీ ప్రజల గొంతు నొక్కు తొక్కుతున్నారని బాబును కడిగేశారు. ఆఖరికి పోరాడే శక్తిని కూడా బాబు నిర్వీర్యం చేయాలని చూస్తున్నాడని ధ్వజమెత్తారు. ఏపీ ప్రజల పోరాట పటిమను, ఆకాంక్షను కేంద్రానికి తెలియజెప్పేందుకు ఉమ్మడిగా ఉద్యమం చేద్దామని వైఎస్సార్సీపీ పిలుపునిచ్చినా...తెలుగుదేశం నుంచి  ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరమన్నారు. హోదా కోసం పోరాటానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు.  కాంగ్రెస్ చేసిన పాపమే బీజేపీ చేస్తోందని,  ఇంతగా అన్యాయం చేస్తున్నప్పుడు మాట్లాడకపోతే ఎలా అని బాబుపై నిప్పులు చెరిగారు. 

ప్రత్యేకహోదా కోసం పలానా కార్యక్రమం చేస్తామని ప్రభుత్వం ప్రజలకు చెప్పకపోగా...పోరాడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై  నిందలు వేస్తోందని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే ఎలా అని టీడీపీ, బీజేపీలపై వాసిరెడ్డి పద్మ ఫైరయ్యారు. ప్రజల తరపున అండగా ఉంటామని బాబు మాట్లాలేకపోతున్నారంటే.....ఏ ప్రయోజనంతో ఇంతగా రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నారో చెప్పాలని నిలదీశారు. మాట్లాడే వాళ్లను కూడా మాట్లాడనీయకుండా మొట్టికాయలు వేస్తూ....చంద్రబాబు టీడీపీ నేతలకు పిరికితనాన్ని నూరిపోస్తున్నారని ఎద్దేవా చేశారు.   ప్రజలందరూ ఉమ్మడి ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నారని, హోదా కోసం ఏం చేస్తారో చెప్పాలని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. 

తాజా ఫోటోలు

Back to Top