హైదరాబాద్, 14 సెప్టెంబర్ 2012: కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ ధరను వెంటనే ఉపసంహరించాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. లీటర్ డీజిల్‌పైన రూ.5 పెంచడం, ఇంటిలో వినియోగించే గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కేంద్ర ప్రభుత్వం సీలింగ్ పెడుతూ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ డిమాండ్ చేశారు. పెంచిన డీజిల్ ధరను వెనక్కి తీసుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.<br/>గృహ అవసరాల కోసం ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు మాత్రమే ప్రస్తుత ధరకు కేటాయిస్తామని, ఆ పైన కావాలంటే ఒక్కొక్క సిలిండర్‌కు రూ.750 చెల్లించాలని చెప్పడాన్ని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. పభుత్వం ఒక వాణిజ్య సంస్థలా మారి లాభనష్టాల గురించి ఆలోచిస్తోందని దుయ్యబట్టారు. డీజిల్ ధర పెంచడంతో అన్ని వస్తువుల రేట్లు పెరుగుతాయన్నారు. ఒకవైపు పేదల కొనుగోలు శక్తి పెరగకపోవడం, మరోపక్క విద్యుత్ కొరత కారణంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలవుతున్న పరిస్థితుల్లో ప్రజలపై భారం మోపడం ప్రభుత్వ బాధ్యత కాదని విజయమ్మ పేర్కొన్నారు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరను పెంచినా, ఇక్కడి ఆడపడుచుల మీద ఆ భారం పడకూడదనే అభిప్రాయంతో ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించే ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి భరోసా ఇవ్వాలని విజయమ్మ కోరారు.