'పేద' చదువుకు శరాఘాతం

రీయింబర్స్‌మెంట్‌కు తూట్లు

హైదరాబాద్, 28 ఆగస్టు 2012: అనుకున్నంతా అయింది. ఇంజనీరింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం చేతులెత్తేసింది. పథకం అసలు లక్ష్యానికి తూట్లు పొడిచింది. పేద విద్యార్థి ప్రతిభకు పాతర వేసింది. ప్రభుత్వం తరఫున భర్తీ చేసే మొత్తాన్ని పరిమితం చేసింది. కళాశాలల వారీగా ఎంతెంత ఫీజు వసూలు చేస్తున్నా దానితో తమకు సంబంధం లేదని తేల్చిచెప్పింది. అందరికీ రూ.35 వేలనే రీయింబర్స్‌ చేస్తామని స్పష్టం చేసింది. ఈ పథకం కింద అర్హులైనప్పటికీ.. అంతకన్నా ఎక్కువ ఫీజు వసూలు చేసే ఉత్తమ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులు.. వారి పాట్లు వారే పడాలని పరోక్షంగా తేల్చిచెప్పింది.ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం మంగళవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉప సంఘం చైర్మన్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ఈ నిర్ణయాలను అధికారికంగా మీడియాకు వెల్లడించారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, బీసీ సంక్షేమ మంత్రి బస్వరాజు సారయ్యతో పాటు సాంఘిక,  గిరిజన, వెనుకబడిన సంక్షేమ శాఖలు, ఉన్నత విద్యాశాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఉపసంఘం సమావేశానికి హాజరయ్యారు.ఏఎఫ్‌ఆర్‌సీ సిఫారసు మేరకు రూ.50 వేల నుంచి రూ.1.05 లక్షల వరకు ఫీజు పెరిగిన 67 కళాశాలల్లోను, అదేవిధంగా కోర్టు తీర్పు మేరకు రూ.50,200 చెల్లించాల్సిన 44 కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఎంత మేరకు రీయింబర్స్ చేయాలన్న అంశంపై ఉప సంఘం చర్చించింది. పలు ప్రత్యామ్నాయాలను పరిశీలించిన ఉపసంఘం, చివరకు రూ.35 వేల కన్నా ఎక్కువ చెల్లించకూడదని నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఫీజులను భరిస్తే ఖజానాపై భారం పడుతుందని సంక్షేమ శాఖల అధికారులు మంత్రులకు చెప్పారు. ఈ ఏడాది కొన్ని కళాశాలల్లోనే ఫీజులు పెరిగినా, ప్రతియేటా ఫీజులు పెరిగే కళాశాలల సంఖ్య కూడా పెరిగితే చివరకు అది రూ.1,000 కోట్లకు చేరుతుందని వివరించారు.ఒక ఏడాది మొత్తం ఫీజును భరించాలని నిర్ణయించిన తర్వాత మళ్లీ తప్పుకునేందుకు అవకాశముండదని, అందువల్ల ఇప్పుడే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని అధికారులు ఉపసంఘానికి సూచించారు. సుమారు గంటన్నర పాటు సాగిన చర్చల అనంతరం రూ.35 వేల కన్నా ఎక్కువ ఫీజు చెల్లించకూడదని ఉప సంఘం నిర్ణయించింది. దీనితో ఉన్నత విద్యా ప్రమాణాలు కలిగిన కళాశాలల్లో చదువుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనుకున్న ప్రతిభ గల పేద విద్యార్థుల ఆశలపై నీళ్లుచల్లింది.

ప్రభుత్వ కళాశాలలతో లింకు!

రీయింబర్స్‌మెంట్‌కు పరిమితి విధించడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందన్న అంశంపై ఉప సంఘ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యంగా ప్రతిభ గల విద్యార్థులు మంచి ర్యాంకు సాధించినా, మంచి కళాశాలలో చేరలేని పరిస్థితి ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమయింది. అందువల్ల ఉభయతారకంగా ఓ నిర్ణయం తీసుకుంటే మంచిదని సంక్షేమ శాఖల అధికారులు ప్రతిపాదించారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ చదివిన ప్రతిభ గల పేద విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లిస్తే సరిపోతుందని సూచించారు.10 వేల లోపు ర్యాంకర్ల అర్హతపై ముఖ్యమంత్రి నిర్ణయానికి...దీనిపై చర్చించిన ఉప సంఘం ప్రభుత్వ కళాశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఇంటర్ చదివిన విద్యార్థులు 10 వేల లోపు ర్యాంకు సాధిస్తే వారికి మొత్తం ఫీజు చెల్లించడంపై ఓ అంగీకారానికి వచ్చారు. ఇంతకన్నా ఏమీ చేయలేమని, ఈ మేరకు సరిపెట్టడమే ఉత్తమమని నిర్ణయించారు. అయితే ఈ ప్రతిపాదనను సీఎంకు చెప్పి ఆయన అంగీకారం మేరకు ప్రకటించాలని నిర్ణయించారు.

అందరికీ మొత్తం ఫీజు చెల్లించాల్సిందే..

ప్రభుత్వ కళాశాలల్లో చదివిన మెరిట్ విద్యార్థుల (10 వేల లోపు ర్యాంకు) మొత్తం ఫీజు మాత్రమే భరించాలనుకొంటున్న ప్రభుత్వ యోచనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫీజు ఎంత అన్నదానితో సంబంధం లేకుండా అందరికీ మొత్తం ఫీజు చెల్లించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఖర్చు తప్పించుకునేందుకే ప్రభుత్వం ఇలాంటి లింకు పెడుతోందని అంటున్నారు. వసతులు సరిగాలేని ప్రభుత్వ కళాశాలల్లో ఎంతమంది తమ ప్రతిభను మెరుగుపరుచుకోగలరనే ప్రశ్న తలెత్తుతోంది. మరోపక్క అప్పోసొప్పో చేసి ఇంటర్ను  ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఇంటర్మీడియట్ ఫీజులు కార్పొరేట్ కళాశాలల్లో అధికంగా ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లోని జూనియర్ కాలేజీల్లో రూ.10 వేలకు మించి లేవు. అందులో ప్రభుత్వం ఇచ్చే ట్యూషన్‌ఫీజు,  స్కాలర్‌షిప్ కలిపి రూ.5 వేల వరకు ఉంటోంది. అందువల్ల, మరో రూ.5 వేల వరకు అప్పోసొప్పో చేసి తమ పిల్లలను తల్లిదండ్రులు చదివిస్తున్నారు. ఎందుకంటే ఇంజనీరింగ్‌కు ఎలాగూ ప్రభుత్వమే మొత్తం ఫీజును భరిస్తుందనే నమ్మకంతో. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మొత్తం ఫీజును భర్తీకాని పరిస్థితి. దీంతో ప్రైవేటు కళాశాలల్లో చదివిన ప్రతిభ గల పేద విద్యార్థులు ఫీజు తక్కువ ఉన్న కళాశాలలనే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫీజు ఎంత అన్న దానితో సంబంధం లేకుండా, విద్యార్థి చదివింది ప్రైవేటా,  ప్రభుత్వ కళాశాలా అన్నది చూడకుండా.. మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మొత్తం వ్యయం రూ.50 కోట్ల లోపే!

రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించాలని ఫ్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ఈ ఏడాదికి ఖజానాపై పడే భారం రూ.50 కోట్లలోపే ఉంటుందని అంచనా. ఈ ఏడాది ఎంసెట్‌లో మొత్తం 2.07లక్షల మంది విద్యార్థులు అర్హత పొందారు. వీరిలో కన్వీనర్ కోటాలో అడ్మిషన్ పొందేవారు 1.45 లక్షల మంది. అందులో ఫీజుల పథకం లబ్ధి పొందేవారు 1.16 లక్షలు (కన్వీనర్ కోటాలో సీటు పొందిన వారిలో 80శాతం మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతారన్న అంచనా మేరకు) ఉంటారు. గతంలో రూ.31వేలు ఫీజుండగా, అనేక కళాశాలల్లో ఫీజులు పెరిగినా.. ప్రభుత్వం రూ.35 వేలే చెల్లిస్తానంటోంది. ఈ ఫీజే లెక్కించినా.. ప్రతి విద్యార్థికీ రూ. 4 వేల ఫీజు పెరుగుతోంది. ఈ విధంగా రూ. 46.4 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.
ఒకవేళ ప్రభుత్వ కళాశాలల్లో చదివి ప్రభుత్వం నిర్ణయించిన కటాఫ్‌లోపు ర్యాంకు తెచ్చుకున్న విద్యార్థులకు ఫీజు మొత్తం భర్తీ చేసినా అందుకయ్యే వ్యయం గరిష్ఠంగా రూ. 10 కోట్లకు మించదని సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల అంచనా.

అదనపు ఫీజు విద్యార్థులే భరించాలి:మంత్రి పితాని

ఎక్కువ ఫీజులుండే కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులు అదనపు ఫీజును భరించాల్సిందేనని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉపసంఘం సమావేశం అనంతరం ఆయన మీడియా వద్ద ఈ విషయం స్పష్టం చేశారు. ఫీజు ఎంత ఉన్నా రూ.35 వేలు మాత్రమే చెల్లించాలని ఉపసంఘం నిర్ణయించిందని తెలిపారు. ఏఎఫ్‌ఆర్సీ సిఫారసు మేరకు ఫీజులు పెరిగిన కళాశాలల్లో ఫీజును ఏఎఫ్‌ఆర్సీ, టాస్క్‌ఫోర్స్ తనిఖీల తర్వాతే ఖరారు చేస్తామని మరోసారి చెప్పారు. కాలేజీల అర్హత, ప్రమాణాలు,  ఫ్యాకల్టీని బట్టి ఫీజులు తగ్గే అవకాశమూ ఉంటుందన్నారు. అఫిడవిట్లు సమర్పించకుండా హైకోర్టుకు వెళ్లిన కళాశాలల్లో కూడా ఈ ఫీజులు తగ్గడంతో సంబంధం లేకుండా రూ.35 వేలు మాత్రమే ప్రభుత్వం చెల్లించనున్నందున, అదనపు ఫీజును భరాయించేందుకు విద్యార్థులు సిద్ధపడే ఆయా కళాశాలల్లో చేరాలని ఆయన పరోక్షంగా సూచించారు. ప్రతిభ గల విద్యార్థులను ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం ఆలోచిస్తుందని, దీనిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.


తాజా వీడియోలు

Back to Top