<strong>జడ్చర్ల (మహబూబ్‌నగర్ జిల్లా),</strong> 6 డిసెంబర్ 2012: పత్తి పంటకు మద్దతు ధర అడిగినప్పుడు పట్టించుకోకపోతే ఈ పాలకులను చొక్కా పట్టుకుని నిలదీయమని శ్రీమతి షర్మిల రైతులకు హితోపదేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు, దానికి పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వైఖరిని ఎండగట్టి, కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకు శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తరఫున శ్రీమతి షర్మిల ఈ సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు.<br/>ఈ క్రమంలో శ్రీమతి షర్మిల గురువారంనాడు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె గంగాపూ ర్ లో రచ్చబండ నిర్వహించారు. తాము ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర రావటం లేదని పత్తి రైతులు శ్రీమతి షర్మిలకు తమ ఆవేదనను వినిపించారు.<br/>రాష్ట్రంలోని పాడి పరిశ్రమ రైతులను ఆదుకోవటంలో కిరణ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శ్రీమతి షర్మిల ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో గంగాపూర్ లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ ఈ గ్రామానికి వచ్చి రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన విషయాన్ని శ్రీమతి షర్మిల గుర్తు చేశారు.<br/>కాగా, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శ్రీమతి షర్మిల ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.