రైల్వే జోన్ కోసం పాదయాత్ర చేపడుతాం

విశాఖపట్నం :

 విశాఖ రైల్వేజోన్‌ కోసం పోరాటం ఉధృతం చేస్తామని వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విశాఖలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో విశాఖ రైల్వేజోన్‌ ప్రకటన లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. మార్చి 9లోగా విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బొత్స డిమాండ్ చేశారు. కేంద్రం రైల్వేజోన్‌పై ప్రకటన చేయకుంటే పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో అనకాపల్లి నుంచి భీమిలీ వరకు 250 కి.మీ. పాదయాత్ర చేపడతామన్నారు. రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల మనోభావాలను చంద్రబాబు పరిగణనలోనికి తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏమీ కేటాయించకున్నా సీఎం చంద్రబాబు స్వీట్లు పంచుకోవడం దారుణమన్నారు. ల్యాండ్‌ పూలింగ్ ద్వారా టీడీపీ నేతలు కమీషన్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై బాబు సర్కార్‌ స్పందించకపోవడం శోచనీయమన్నారు. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం హోదాను తాకట్టుపెట్టారని దుయ్యబెట్టారు. పార్లమెంట్‌లో వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హోదాపై ప్రశ్నిస్తే కమిటీ వేశామని చెప్పడం బాధాకరమని బొత్స అన్నారు.  విశాఖ ఉత్సవ్‌ పండుగ కాదు ఒక జాతర అన్నారు. మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్, జిల్లాకు చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top