గుంటూరుః ప్రత్యేకహోదా డిమాండ్ తో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ జగన్ కు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ధర్నాలు, రిలేదీక్షలు, వంటావార్పు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రత్యేకహోదా వచ్చే వరకు వైఎస్ జగన్ నాయకత్వంలో అలుపెరగని పోరాటం చేస్తామని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. <br/>పశ్చిమగోదావరి: ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు స్పష్టం చేశారు. ప్రత్యేక ప్యాకేజీ వస్తే అది కేంద్రమంత్రి సుజనాచౌదరిలాంటి నేతల జేబు నిండుతుందని ఎద్దేవా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షకు మద్దతుగా ఏర్పాటు చేసిన రిలే దీక్షలో శేషుబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ మధ్య గల తేడాను ఆయన వివరించారు. <br/>వైఎస్సార్ జిల్లా: ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్ధమని, టీడీపీ ఎమ్మెల్యేలు అందుకు సిద్ధమా అని పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. హోదా వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామ చావిడి నుంచి ప్రారంభమై మూడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ సాగింది. ప్రత్యేకహోదా సాధన కోసం యువత ముందుకు రావాలని రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు.<br/>నరసాపురం: ప్రత్యేకహోదా వచ్చే వరకు తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష ఆగదని ఆ పార్టీ నేత కొత్త సుబ్బరాయుడు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నరసాపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే మేలంటున్న బీజేపీ, టీడీపీలు ఎన్నికల ముందు ఈ మాట ఎందుకు చెప్పలేదని సుబ్బారాయుడు ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు చంద్రబాబు మద్దతు ప్రకటించకపోతే ప్రజల ఆగ్రహాన్నిగురికాక తప్పదని హెచ్చరించారు.<br/>