'పాపం.. చంద్రబాబు.. మతి చెడింది'

హైదరాబాద్‌:

రెండుసార్లు ప్రజల ఛీత్కారానికి గురి అధికారం కోల్పోయిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు మతి భ్రమించిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ ‌వ్యాఖ్యానించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న పార్టీ అధ్యక్షుడు, కడప ఎం.పి. శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని సోమవారం బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నా‌థ్‌రెడ్డి కుమారుడు జగదీశ్వర్‌రెడ్డి ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం జైలు బయట బాజిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టిన తరువాత తమకు అడ్డెవరూ లేరని, తాము ఆడిందే ఆట, పాడిందే పాటని ఊహించిన చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను ఆదరించడం మింగుడుపడటం లేదన్నారు. ఇది తట్టుకోలేకే జైలులో ఉన్న శ్రీ జగన్‌పై చంద్రబాబుతో పాటు ఆయన అనుచరులు తప్పుడు కూతలు కూస్తున్నారని ఆరోపించారు. తొమ్మిదేళ్లు సిఎంగా ఉన్న చంద్రబాబు జైళ్ల శాఖపై ఆరోపణలు చేస్తూ ఖైదీలు నీలిచిత్రాలు చూస్తున్నారని చేసిన వ్యాఖ్యలను బట్టి ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

శ్రీ జగన్‌కు జైలులో అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారని టిడిపి నాయకుడు యనమల రామకృష్ణుడు రాద్ధాంతం చేయడం తగదని, జైళ్ల శాఖ డి.జి. కృష్ణరాజుపై టిడిపి మరో నాయకుడు మండవ వెంకటేశ్వరరావు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బాజిరెడ్డి అన్నారు. జైళ్ల శాఖపై నమ్మకం లేకుంటే చంద్రబాబుపై నేరం మోపి జైలుకు పంపితే శ్రీ జగన్ దినచర్యలు కళ్లారా చూసి సంతోషిస్తాడని ఆ పార్టీ నాయకులకు హితవు పలికారు.

జైలు వద్ద‌ చంద్రబాబు కాపలా ఉండాలి: సంకినేని
శ్రీ వైయస్ జగ‌న్‌పై టిడిపి నాయకులు చేస్తున్న అవాస్తవ ప్రచారాలు మానుకోవాలని, చంద్రబాబు జైలు గేటు వద్ద ప్రతిరోజూ కాపలా కాస్తే శ్రీ జగన్‌ను ఎవరెవరు కలుస్తున్నారో స్వయంగా చూడవచ్చని మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. నిబంధనలకు లోబడి శ్రీ జగన్ ములాఖత్ నడుస్తోందని‌ ఆయన చెప్పారు

Back to Top