పాల ధర అప్పుడు రూ.22, ఇప్పుడు 14.40

మహబూబ్‌నగర్‌, 12 డిసెంబర్‌ 2012: మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పాడి రైతుల పట్ల అమితమైన ప్రేమ చూపించారని జిల్లాలోని పెంజర్లకు చెందని పాడి రైతు వన్నె శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం పాదయాత్రలో మహబూబ్‌నగర్ జిల్లా పెంజెర్ల, ‌కొడిచెర్ల గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో శ్రీమతి షర్మిల స్థానికులతో మాట్లాడారు. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు తన గోడు వినిపించారు. ఆ మహానుభావుడు చూపిన ప్రేమ వల్లే తాను పాడి గేదెలు పెట్టినట్లు చెప్పారు.

మహానేత వైయస్‌ఆర్ ఉన్నప్పుడు వర్షాలకు‌, కరెంటుకు కొదవే లేదన్నారు. కావలసినంత పచ్చిగడ్డి దొరికిందన్నారు. ఒక్కొక్క గేదె రోజుకు ఎనిమిది లీటర్ల వరకు పాలిచ్చాయని చెప్పారు. డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి బ్రతికి ఉన్నప్పుడు లీటరు పాలకు ధర రూ. 22 పలికిందన్నారు. ఈ మహానేత ఒక్కొక్క గేదెకు పట్టుపట్టి రూ. 50 వేల బీమా ఇచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన వెళ్లిపోయిన తరువాత పాల మద్దతు ధర రూ. 19.50కు పడిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం లీటరు పాలకు రూ.14.40 మాత్రమే కట్టి ఇస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. డిగ్రీ వరకూ చదువుకున్న శ్రీనివాసులు మహానేత వైయస్‌ పిలుపుతో పాడి పరిశ్రమను పెట్టుకున్నారు.

ఇప్పుడు వర్షాలు సరిగా పడడం లేదని, కరెంటు ఉండడం లేదని, ఎండుగడ్డి కూడా దొరికే పరిస్థితి లేదక్కా అని శ్రీమతి షర్మిల ముందు రైతు శ్రీనివాసులు ఆవేదన చెందారు. అప్పట్లో రోజుకు ఎనిమిది లీటర్ల పాలు ఇచ్చే పశువులు ఇప్పుడు 3-4 లీటర్ల పాలే ఇస్తున్నాయన్నారు. తగ్గిపోయిన పాల దిగుబడితో రైతులు డెయిరీని నడపలేక పోతున్నారక్కా. రూ.50 వేలు.. రూ.60 వేలు ఖర్చు పెట్టి తెచ్చిన పశువులను అడ్డికి పావుశేరు లెక్కన అమ్ముకోవాల్సి వస్తోందక్కా’ అని శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. పెంజర్ల గ్రామానికే చెందిన మేకల శ్రీశైలం మాట్లాడుతూ.. తనది కూడా ఇదే దుస్థితి అని, ఏం చేయాలో పాలుపోవడంలేదని అన్నారు.
Back to Top