రైతులు వద్దంటున్నా వినరా? రాజధానిపై బాబుగారి మొండివైఖరి

రైతులు వద్దంటున్నా వినరా?
రాజధానిపై బాబుగారి మొండివైఖరి
మూడు పంటలు పండే పొలాలే కావాలా?
శివరామకృష్ణన్‌కమిటీ నివేదికా బుట్టదాఖలు
10 గ్రామాల్లో అన్నదాతల ఆందోళనలు


ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విషయంలో నారాచంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్నదాతలకు కంటనీరు తెప్పిస్తున్నది. తాము వద్దన్నా రాష్ర్ట ప్రభుత్వం ఎందుకు ఇంత మొండి పట్టుదలతో వ్యవహరిస్తున్నదో రైతులకు అర్ధం కావడం లేదు. పంటలు పండని మెట్టపొలాల రైతులు కొందరు ల్యాండ్ పూలింగ్‌కు ముందుకొస్తున్న విషయాన్ని మీడియాలో హైలైట్ చేస్తూ రైతులంతా అనుకూలమేనన్న అభిప్రాయం కలిగేలా ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో భూములివ్వడానికి వ్యతిరేకంగా ఉన్న రైతులపైకి పోలీసులను ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో  కొత్త రాజధానిని ఎంపిక చేస్తారనుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏకపక్షంగా గుంటూరు, కృష్ణా జిల్లా సరిహద్దుల్లో కృష్ణానదికి సమీపంలో నిర్మించాలని తలపెట్టింది. రెండు మూడు పంటలు పండే పచ్చని పంట పొలాలను రాజధాని కోసం ఎంపిక చేయడం సరికాదని కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కింది. పచ్చటి పొలాల్లో రాజధాని పేరుతో కాంక్రీట్ జంగిల్ ను నిర్మించవద్దని పర్యావరణవేత్తలు కూడా ఘోషిస్తున్నారు. అంతే కాదు, ఏటా మూడు నాలుగు పంటలు పండే పొలాలను రాజధాని కోసం తీసుకుంటే ఆహారభద్రతకు కూడా నష్టమేనన్న వాదనలనూ  చంద్రబాబు పట్టించు కోలేదు. ఏడాడి మొత్తం పూలు, పళ్లు, కూరగాయలు పండించే సారవంతమైన భూములున్న ఈ గ్రామాల్లో జీవనం సాగిస్తున్న రైతులు తమ పొలాలు రాజధానికి ఇవ్వబోమని వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నా పట్టించు కోవడం లేదు. చివరకు రైతులు తమ పొలాల్లో బోర్డులు కూడా పెట్టారు. రాజధానికి నా పొలం ఇవ్వబోను అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ఈ బోర్డులు అడుగడుగున్నా కనిపిస్తున్నాయి.

ఆ రైతుల నిరసనలు పట్టించుకోరా?
రాజధాని నిర్మించాలని ప్రతిపాదించిన సుమారు 30 గ్రామాల్లో పది గ్రామాల వాసులు తమ పొలాలను ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అందుకు ప్రధాన కారణం ఇవన్నీ కృష్ణానదికి ఆనుకునే ఉండటం. పైగా అవన్నీ పచ్చటి పొలాలే. కృష్ణానది ఒడ్డునే ఉన్నాయి కనుక ఐదు నుంచి పదడుగులు తవ్వితే నీళ్లు పుష్కలంగా లభ్యం అవుతాయి. రాజధాని ప్రకటించక ముందే అక్కడ ఎకరం మూడు కోట్ల రూపాయల ధర పలుకుతోంది. రాజధాని ప్రకటన వెలువడ్డాక ఆ భూములకు మరింత గిరాకీ వచ్చింది. అరెకరా, 50 సెంట్లు, 80 సెంట్లు, ఒక ఎకరా ఆస్తిగా గల రైతులే ఎక్కువ (98శాతం)గా ఆ గ్రామాల్లో ఉన్నారు. అరెకరా ఉన్న రైతు కోటీశ్వరు డన్నమాట. ఆ గ్రామాల్లో చదువుకున్న వారు అనేకులున్నా వారికి ఉద్యోగాలు దొరికితే సరి లేకుంటే సొంతూరికి వచ్చి కూరగాయలు పండించి బతుకుదామన్న ఆలోచనగల వారెందరో ఉన్నారు. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, నవులూరు, తాడేపల్లి, ఉద్దండరాయుడి పాళెం, లింగాయ పాళెంతో సహా మరిన్ని గ్రామాల్లో పరిస్థితి ఇదే. సింగపూర్ నుంచి తీసుకువచ్చిన ప్రత్యేక బృందాన్ని విమానంలోనే తిప్పి రాజధాని ప్రాంతాన్ని చూపించి పంపేసిన ఘనుడు మన చంద్రబాబు గారు. నేలపై తిరిగితే ఆ బృందానికి అడుగడుగునా నిరసనలు కనిపించేవి. ఈ అన్యాయం తగదు అని బాబుగారికి హితవు చెప్పి వెనక్కి వెళ్లిపోయేవారు. సింగపూర్ బృందం ఏరియల్ సర్వే చేస్తున్న సమయంలో రాజధాని రైతులు అనేక చోట్ల నేలపై నల్ల జెండాలతో నిరసనలు తెలిపారు.

ల్యాండ్ పూలింగ్‌తో లాభపడేవారెవ్వరు?

రాజధాని కోసం ఎంపిక చేసిన ఓ పదిహేను గ్రామాలు కృష్ణా నదికి కాస్త ఎడంగా గుంటూరు జిల్లాలోని వినుకొండ ప్రాంతం వైపునకు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ఎక్కువగా ఉండేది మెట్ట పొలాలే కనుక అక్కడి రైతులు తమ భూములను రాజధానికి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రక టించిన అస్పష్టమైన ల్యాండ్ ఫూలింగ్ (పూలింగ్) విధానం వల్ల తమకు మేలే జరుగుతుందని తుళ్లూరు మండలం, ఆ పై ప్రాంతాల గ్రామాల వారు విశ్వసిస్తున్నారు. ప్రభుత్వం కూడా దీనినే సాకుగా తీసుకుని మెట్ట ప్రాంతంలో ఉన్న రైతులను రెచ్చగొట్టి వారిని మాగాణి ప్రాంత రైతుల నుంచి విభజించి తన పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. కాకతాళీయమో, యాదృచ్ఛికమో తెలియదు గానీ పచ్చటి పొలాలున్న ప్రాంతంలో ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజలెక్కువగా ఉన్నారు. మెట్ట ప్రాంతంలో చంద్రబాబు సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్నారు. రాజధానికి భూములివ్వడం వల్ల లాభపడేది మెట్ట ప్రాంతం వారైతే సర్వస్వం కోల్పోయేది పచ్చటి పొలాలున్న మాగాణి ప్రాంతం వారు. రాజధాని కోసం ఎంపిక చేసిన గ్రామాలలో చంద్రబాబు బినామీలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని, అధికారులు వారి జోలికి మాత్రం వెళ్లడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. అంటే పేద రైతుల భూములు మాత్రం సేకరించి వాటిలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు కట్టిస్తే వాటి పక్కనే ఉన్న బినామీల భూముల రేట్లకు ఏస్థాయిలో రెక్కలు వస్తాయో మనం ఊహించాల్సిందే.


అన్నదాతలపై పోలీసులను ప్రయోగిస్తారా?

రైతులు స్వచ్ఛందంగా భూములిస్తేనే తీసుకుంటామని ఓ వైపు ధర్మపన్నాలు వల్లిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరో వైపు పోలీసు బలప్రయోగాన్ని ఉపయోగించి రైతులను భయాందోళనలకు గురి చేస్తోంది. రాజధానికి భూము లివ్వడానికి వ్యతి రేకిస్తున్న గ్రామాల్లో గత సంవత్సరం (2014 డిసెంబర్ 29,30 తేదీల్లో) చివరిలో పొలాలు దగ్ధమైన దుశ్చర్యలను సాకుగా చేసుకుని పోలీసులు ఆయా గ్రామాల్లో ప్రవేశించి అరాచకాలు చేస్తున్నారు. పొలాలు తగులబెట్టిన దుండగులను పట్టుకోవాల్సింది పోయి ఎవరైతే నష్టపోయారో వారినే స్టేషన్లకు పిలిచి గంటల తరబడి అనధికారికంగా నిర్బంధిస్తున్నారు. సవ్యంగా జరగాల్సిన రాజధాని భూసమీకరణ కార్యక్రమంలో భయాందోళనలు సృష్టిస్తున్నారు.

బాబుగారి మూఢనమ్మకానికి రైతులు బలి!
ఏపీలో 13 జిల్లాలకు కేంద్రంగా ఉన్న పలు చోట్ల వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి, అటవీభూమి అందుబాటులో ఉన్నా ఎందుకు ఈ ప్రాంతాన్నే ఎంచుకున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా చంద్రబాబు మాత్రం తన కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తును ప్రధానంగా దృష్టిలో ఉంచుకునే తుళ్లూరు, తాడేపల్లి మండల పరిసర గ్రామాలను ఎంపిక చేశారని ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ఓ ఎంపీ సెలవిస్తున్నారు. అక్కడ రాజధాని నిర్మిస్తే వాస్తు రీత్యా చంద్రబాబుకు అన్ని విధాలా కలిసి వస్తుందని, ఆయన కోరిక ప్రకారం లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబు నమ్ముతున్నారట.  జ్యోతిష్కులు, సిద్ధాంతులు చెప్పిన మీదటే ఈ పనికి పూనుకున్నారని అంటున్నారు. అంటే తన కుమారుడి భవిష్యత్తు కోసం పచ్చని పంట పొలాలు ఏమైనా పర్వాలేదు, రైతులు అన్యాయమై పోయినా పర్వాలేదు అని చంద్రబాబు భావిస్తున్నట్లుగా ఉంది.

తాజా ఫోటోలు

Back to Top