'ఓటు అడిగే హక్కు వైయస్‌ఆర్‌సిపికే ఉంది'

మహబూబ్‌నగర్‌ : అన్నదాతలకు అనేక విధాలుగా మేళ్ళు చేసిన మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి సాక్షిగా సహకార ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఒక్క వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే ఉందని పార్టీ సీఈసీ సభ్యుడు బాణోత్ మద‌న్‌లాల్‌ పేర్కొన్నారు. కొణిజర్ల మండలంలోని గోపవరం సహకార సంఘం నామినేషన్ల ప్రక్రియను ఆయన సోమవారంనాడు పరిశీలించారు.

అనంతరం మదన్‌లాల్ విలేకరులతో మాట్లాడుతూ‌, రైతుల పక్షపాతిగా ఉన్న మహానేత రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు తక్కువ ధరలకే అందజేశారని అన్నారు. ఆయన మరణానంతరం అన్నదాత పరిస్థితి అయోమయంగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం దండగ అనే స్థితికి రైతులు చేరారని, అందుకు నిదర్శనమే క్రాప్ హాలిడే ప్రకటిం‌చడమని అన్నారు. 12,400 కోట్ల మంది రైతుల బ్యాంకు రుణాలను మహానేత మాఫీ చేస్తే ప్రస్తుత ప్రభుత్వం కనీసం అర్హులకు కూడా రుణాలు అందించలేని పరిస్థితిలో ఉందని అన్నారు.

రాజన్న రాజ్యం మనకు మళ్ళీ రావాలంటే వైయస్‌ఆర్‌సిపి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని మదన్‌లాల్‌ అన్నారు. రైతుల కోసం మూడు వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని వైయస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి గతంలోనే ప్రకటించారని అన్నారు.

అన్నదాతను ఆదుకున్నది వైయస్ఆ‌ర్‌ :
వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యు‌త్, రుణమాఫీ చేసి ఆదుకున్నారని బాణో‌త్ మద‌న్‌లాల్ ‌గుర్తుచేశారు. ఏన్కూరులోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ అధికారంలోకి రాకముందు పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డాడరని, వరి ధాన్యం కొ‌నే నాథుడే కరవై 70 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని గోడౌన్లలో నిల్వ చేయడంతో తడిసి మొలకెత్తాయని అన్నారు. అధికారంలోకి వచ్చాక మహానేత సహకార సంఘాలకు ప్రత్యేక నిధులు కేటాయించి బలోపేతం చేశారని అన్నారు.
Back to Top