మైలవరం (కృష్ణాజిల్లా) :
సమైక్య రాష్ట్రాన్ని రక్షించగల సత్తా ఉన్న ఏకైక నాయకుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఒక్కరే అని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. కృష్ణాజిల్లాలోని మైలవరం బోసుబొమ్మ సెంటర్‌లో శనివారం నిర్వహించిన సమైక్య శంఖారావంలో రాంబాబు ముఖ్య అతిథిగా మాట్లాడారు. చంద్రబాబు, లగడపాటి, సీఎం కిరణ్‌లు సమైక్యాంధ్ర ద్రోహులని ఆయన ఆరోపించారు. రెండు కళ్ల సిద్ధాంతం పాటిస్తున్న చంద్రబాబు నాయుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డిని విమర్శించడం హాస్యాస్పదం అన్నారు. కోడెల శివప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు సీమాంధ్రలో సమైక్యం అని మాట్లాడుతుంటే.. తెలంగాణలో రేవంత్‌రెడ్డి తదితరులు రాష్ట్రం విడిపోవాలని కోరుతున్నారని, విభజనను అంగీకరిస్తూ లేఖ ఇచ్చింది చంద్రబాబే అని చెబుతున్నారన్నారు. టీడీపీలోని ఇరుప్రాంతాల వారు చెబుతున్న విరుద్ధమైన మాటలకు సమాధానం చెప్పలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అంబటి ఎద్దేవా చేశారు.
సమైక్య సింహం అని తనను పొగిడించుకున్న సీఎం కిరణ్ సమైక్యం కోసం ఏం చేస్తున్నారో చెప్పాలని అంబటి రాంబాబు నిలదీశారు. తన ఆస్తులను కాపాడుకోవటానికే లగడపాటి ఢిల్లీలో సోనియా చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రాష్ట్రంలో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీలను మట్టికరిపించి అధికారం చేపట్టగల సత్తా శ్రీ వైయస్ జగన్‌కు మాత్రమే ఉందన్నారు. జోగి రమేష్‌ను మైలవరం నియోజకవర్గం ఆహ్వానిస్తోందని రాంబాబు చెప్పారు. మైలవరం ఎమ్మెల్యేగా అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి జోగి రమేష్ అని తెలిపారు.
జాతి గౌరవాన్ని కాపాడగలిగిన ఒకే ఒక్కడు శ్రీ వైయస్ జగన్ అని ఆయనతోనే సమైక్యాంధ్ర సాధ్యం అవుతుందని పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర కో ఆర్డినేటర్ టీఎస్ విజయ్ చందర్ అన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న మొనగాడు, సోనియా మొదలు నాయకులందరికీ నిద్ర పట్టకుండా చేస్తున్న వ్యక్తి శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వైయస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్‌ను ప్రజల హర్షధ్వానాల మధ్య ఆవిష్కరించారు.