హైదరాబాద్ః అవిశ్వాస తీర్మానంపై శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం... అధికార పక్షం నుంచి పలు అవాంతరాల మధ్య కొనసాగుతోంది. ఆయన ప్రసంగానికి పదే పదే ఆటంకం ఏర్పడింది. వైఎస్ జగన్ మాట్లాడుతుండగానే మంత్రులు జోక్యం చేసుకుని, ఆయన ప్రసంగానికి అడ్డు తగులుతున్నారు. సాధికారిక లెక్కలతో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతుండగా, తట్టుకోలేని టీడీపీ సభ్యులు వైఎస్ జగన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వారు అడిగిన ప్రతిసారీ స్పీకర్ మైక్ ఇవ్వడంతో పదే పదే వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. విమర్శలు చేస్తూ ఎదురుదాడికి యత్నించారు.<br/>ఈ సందర్భంగా ఇదేమి పద్ధతంటూ వైఎస్ జగన్ నిలదీశారు. ప్రతి 5 నిమిషాలకోసారి తన ప్రసంగాన్ని ఆపడం ఆన్యాయమని, తాను మాట్లాడేది పూర్తయిన తర్వాత వాళ్లు మాట్లాడవచ్చని ఆయన అన్నారు. తనకు మాట్లాడేందుకు రెండు గంటలు సమయం ఇచ్చారని, తాను మాట్లాడుతుంటే అధికార సభ్యులకు మాట్లాడేందుకు ఎలా అనుమతి ఇస్తారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. మాట్లాడుతున్న ప్రతిసారి స్పీకర్ మైక్ కట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.