నేడు ఖమ్మంలో విజయమ్మ బహిరంగసభ

ఖమ్మం 19 నవంబర్ 2012: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సోమవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. ఖమ్మం పట్టణంలోని 'పెవిలియన్‌ గ్రౌండ్‌'లో జరిగే ఒక బహిరంగసభలో ఆమె పాల్గొంటారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు జలగం వెంకట్రావుతో పాటు ఆయన అనుచరులు పలువురు వైయస్ఆర్ సీపీలో చేరుతున్న సందర్భంగా ఈ సభను నిర్వహిస్తున్నారు.  హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు రోడ్డుమార్గంలో బయలుదేరి సూర్యాపేట మీదుగా మధ్యాహ్నం 3.30 గంటలకు విజయమ్మ ఖమ్మం చేరుకుంటారు. కొంతసేపు  స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం 4
గంటలకు పెవిలియన్‌గ్రౌండ్‌లో జరిగే సభలో పాల్గొంటారు.
వైయస్ఆర్ సీపీ ఆవిర్భావం
తర్వాత తొలిసారి జిల్లాలో నిర్వహిస్తున్న బహిరంగసభను విజయవంతం చేసేందుకు భారీగా సన్నాహాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి బహిరంగసభకు జనం తరలి వచ్చేందుకు
ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, లారీలు, ఇతర వాహనాలను సిద్ధం చేశారు. ఈ సభలో జలగం వెంకట్రావుతోపాటు పలువురు మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు,
సర్పంచ్‌లతో పాటు వేలాది మంది జలగం అనుచరగణం వైయస్ఆర్‌సీపీలో చేరనున్నారు. వైయస్ఆర్ సీపీ ఐదు జిల్లాల కో
ఆర్డినేటర్ జిట్టా బాలకృష్ణారెడ్డి, జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్,
జిల్లా పరిశీలకులు గున్నం నాగిరెడ్డి, సీజీసీ సభ్యులు మదన్‌లాల్,
చందాలింగయ్య సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
అడుగడుగునా ఫ్లెక్సీలు...
విజయమ్మ రాక సందర్భంగా ఖమ్మం పట్టణం వైయస్ఆర్ సీపీ ఫ్లెక్సీలతో స్వాగత తోరణాలతో కోలాహలంగా మారింది. అడుగడుగునా
జెండాలు, ఫ్లెక్సీలు, తోరణాలు ఏర్పాటు చేశారు. దివంగత మహానేత వైయస్, విజయమ్మ, జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఫొటోలతో ఫ్లెక్సీలు పట్టణమంతా ఏర్పాటయ్యాయి. మయూరిసెంటర్, వైరారోడ్డు, ఇల్లెందు
క్రాస్‌రోడ్డు, రోటరీనగర్, కాల్వొడ్డుతో పాటు పాలేరు నియోజకవర్గంలోని
నాయకన్‌గూడెం నుంచి ప్రతి గ్రామంలోనూ విజయమ్మకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు
ఏర్పాటు చేశారు. సభాప్రాంగణంలో ఏర్పాట్లను పర్యవేక్షించడం కోసం కార్యకర్తలను నియమించారు. తాగునీటి వసతిని కల్పించారు. ప్రధాన కూడళ్ల వద్ద సభను వీక్షించేందుకు ప్రత్యేకంగా ఎల్‌సీడీలు ఏర్పాటు చేస్తున్నారు.
పోలీసులతో పాటు జలగం యువసేన వలంటీర్లను నియమించామని వెంకట్రావు తెలిపారు. నీలం తుపాను బాధితులను పరామర్శించేందుకు ఇటీవలే ఖమ్మం జిల్లాకు
వచ్చిన విజయమ్మకు ప్రజలు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే.
ఇదిలావుండగా వైయస్ఆర్ సీపీలో  జలగం వెంకటరావు చేరికతో
జిల్లాలో పార్టీ బలోపేతమవుతుందని పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు
నంబూరి రామలింగే శ్వరరావు  మీడియాతో అన్నారు. ఖమ్మంలో జరిగే విజయమ్మ సభకు భారీగా తరలిరావాలని పార్టీ
శ్రేణులకు, అభిమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు
కృషితోనే ఖమ్మంజిల్లాకు సాగర్ జలాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. అప్పటి నుంచి జలగం
వెంగళరావును ‘సాగర్ వెంగళరావు’గా ప్రజలు, రైతులు అభిమానంతో
పిలుచుకుంటున్నారన్నారు. ఆయన తనయుడు వెంకటరావు విజయమ్మ సమక్షంలో
వైయస్ఆర్ సీపీలో చేరటం జలగం,  వైయస్ అభిమానులకు పండుగలాంటిదన్నారు. సభ సందర్భంగా ఇల్లెందు క్రాస్
రోడ్ నుంచి ర్యాలీ ఉంటుందని రామలింగేశ్వర రావు తెలిపారు.

Back to Top