మంద కృష్ణను మాదిగలే తరిమికొడతారు

హైదరాబాద్, 3 అక్టోబర్ 2013:

చంద్రబాబు మొరగమంటే మొరిగే బొచ్చుకుక్కలా ఎమ్మార్పీయస్‌ అధ్యక్షుడు మంద కృష్ణను మాదిగలే తరిమి కొడతారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం‌ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్‌ హెచ్చరించారు. 'కాంగ్రెస్‌ పంజరంలో జగన్‌ ఓ చిలక' అంటూ బుధవారం నాడు మంద కృష్ణ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కోర్టులో కేసు తేలక ముందే యావజ్జీవ లేదా మరణశిక్ష వేయాలంటూ మంద కృష్ణ మాట్లాడడం కేవలం చంద్రబాబు నాయుడు, టిడిపి ప్రయోజనాల కోసమే అని ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో గురువారం మధ్యాహ్నం సూర్యప్రకాష్‌ మీడియాతో మాట్లాడారు. ఎమ్మార్పీయస్‌ను ఏ ఆశయం కోసం స్థాపించారో దానిని మర్చిపోయి రాజకీయాలు మాట్లాడడం తగదని హితవు పలికారు.
అగ్ర కులాల ప్రయోజనాల కోసం మంద కృష్ణ తెలంగాణ జెండాను భుజాన వేసుకున్నారని నల్లా విమర్శించారు. అందుకే సీమాంధ్రలోని మాదిగలు ఆయనను తరిమి కొట్టడం ఖాయమన్నారు. కృష్ణ మాదిగ తీరు వల్ల ఎస్సీ వర్గీకరణ కార్యక్రమం కుంటుపడే ప్రమాదం ఉందని సూర్యప్రకాష్‌ విచారం వ్యక్తంచేశారు.

మరో పక్కన చరిత్రను అర్థం చేసుకోకుండా కృష్ణ మాదిగ మాట్లాడడం తగదని నల్లా హితవు పలికారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మాత్రమే మాదిగలకు సంపూర్ణమైన న్యాయం చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడైతే మాదిగలను వంచించి, మభ్యపెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని రిజర్వుడు పార్లమెంటరీ స్థానాల్లో మాల, మాదిగలకు సమన్యాయం చేసిన వ్యక్తి వైయస్ఆర్‌ అని గుర్తుచేశారు. మాదిగలు అడిగిన వెంటనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సంతకం చేసిన వ్యక్తి శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అని సూర్యప్రకాష్‌ పేర్కొన్నారు. ఆ విషయాన్ని మర్చిపోయి చంద్రబాబు మొరగమన్నట్టల్లా మంద కృష్ణ మొరుగుతున్నారని నల్లా ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఏ దొరల కోసం కృష్ణ మాదిగ తెలంగాణ జెండాను భుజాన వేసుకున్నారో అదే దొరలు వరంగల్‌లో రాళ్ళతో కొట్టినా బుద్ధి రాలేదా? అ‌ని కృష్ణ మాదిగను సూర్యప్రకాష్ ఎద్దేవా చేశారు. ఉభయ ప్రాంతాలకూ సమన్యాయం చేయాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇడుపులపాయ ప్లీనరీలో చాలా స్పష్టంగా చెప్పిందన్నారు. తండ్రి పాత్ర పోషించాలని కేంద్రాన్ని పార్టీ కోరితే అది పట్టించుకోకుండా కృష్ణ మాదిగ అవాకులు చెవాకులు మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడికి వంత పాడడం మానుకుని కృష్ణ మాదిగ ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉందని సూర్యప్రకాష్‌ సూచించారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు మాదిగలతో మద్దతు ఇవ్వడాన్ని ఛీకొట్టిన విషయాన్ని గుర్తుచేశారు. పెద్ద రాష్ట్రాల కారణంగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదని, పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటు అవసరం అని అంబేద్కర్‌ చెప్పిన సిద్ధాంతాన్ని అర్థం చేసుకోకుండా కృష్ణ మాదిగ మాట్లాడడం సరికాదన్నారు. అసలు అంబేద్కర్‌ సిద్ధాంతాన్ని కృష్ణ మాదిగ చదివారా అన్న అనుమానం కలుగుతోందన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే మాదిగలే మంద కృష్ణకు దూరమయ్యే ప్రమాదం ఉందని సూర్యప్రకాష్‌ అన్నారు. వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం మంద కృష్ణ కృషి చేస్తేనే మాదిగలు ఆదరిస్తారని, లేదంటే తరిమి కొడతారని హెచ్చరించారు.

తాజా ఫోటోలు

Back to Top