వైయస్ఆర్‌సీపీలో చేరిన 'అనంత', కోనేరు

హైదరాబాద్:

అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి‌ ఆదివారంనాడు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో సాయంత్రం జరిగిన కార్యక్రమంలో అనంత వెంకట్రామిరెడ్డికి పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి అందించిన పరిపాలన రాష్ట్రానికి అవసరమన్నారు. అలాంటి పాలన అందించే శక్తి శ్రీ జగన్మోహన్‌రెడ్డికే ఉందని అన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి పాలనలోనే సీమాంధ్ర అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం వ్యక్తంచేశారు.

తెలుగుజాతికి బాబు ద్రోహం :
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలుగు జాతికి తీరని ద్రోహం తలపెట్టారని వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఒకవైపు విభజనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ కేంద్రానికి లేఖ ఇవ్వడమే కాక పార్లమెంటులో కూడా వారి ఎంపీల చేత అనుకూలంగా ఓటు వేయించారని దుయ్యబట్టారు. చంద్రబాబు పరిపాలించిన తొమ్మిదేళ్లు రాష్ట్రంలో అరాచకం కొనసాగిందన్నారు. రాష్ట్ర ప్రజలు నరకం చూశారని, ముఖ్యంగా కరవు జిల్లా అయిన అనంతపురం విలవిలలాడిందని చెప్పారు. రైతులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటుంటే ఉచితంగా కరెంటు ఇవ్వాలని వేడుకుంటే కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ఉచితంగా కరెంటు ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందంటూ బాబు అవహేళన చేశారని ఆయన గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అన్నీ ఉచితమంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. మోసపూరిత ధోరణి గల చంద్రబాబు లాంటి వ్యక్తుల ను అడ్డుకోవాల్సిన బాధ్యత తమలాంటి వారిపై ఉందన్నారు.

మహానేత వైయస్ఆర్‌ది సువర్ణ పాలన:
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పాలన రాష్ట్ర చరిత్రలో సువర్ణ‌ అధ్యాయమని అనంత వెంకట్రామిరెడ్డి అభివర్ణించారు. కరవుకాటకాలతో అల్లాడే అనంతపురం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి ప్రశాంతత అందించారని కీర్తించారు. అలాంటి పరిపాలన కావాలని ప్రజలు తపనపడుతున్నారని, శ్రీ జగన్ నాయకత్వంలో మళ్లీ అలాంటి రోజులు వస్తాయనే విశ్వాసంతో పార్టీలో చేరానని వివరించారు.

కోనేరు ప్రసాద్‌ చేరిక :
ప్రముఖ వ్యాపారవేత్త కోనేరు ప్రసాద్‌ కూడా వై‌యస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం ఉదయం వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని ఆదవారం ఉదయం ఆయన నివాసంలో కలుసుకున్నారు. ‌ప్రసాద్‌కు శ్రీ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోనేరు ప్రసా‌ద్‌ను విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీ నాయకత్వం నియమించింది. ఆదివారమే విజయవాడ తిరిగివచ్చిన ఆయనకు నియోజకవర్గ కార్యకర్తలు జిల్లా సరిహద్దు గరికపాడు చెక్‌పోస్టు నుంచే ఘనస్వాగతం పలికారు. విజయవాడ వరకూ ర్యాలీ కొనసాగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, విజయవాడ నగర అధ్యక్షుడు జలీల్‌ఖాన్, నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడ తూర్పు, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తలు మొండితోక జగన్మోహనరావు, రక్షణనిధి, జోగి రమేష్, వంగవీటి రాధాకృష్ణ, పి.గౌతంరెడ్డి తదితరులు కోనేరుతో పాటు ఉన్నారు.

Back to Top