మోసం చేసిన బాబుకు కితాబులా?

హైదరాబాద్, 12 అక్టోబర్‌, 2012: ఎమ్మార్పీయస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ చంద్రబాబు పాదయాత్రలో పచ్చచొక్కాల సరసన చేరి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. వైయస్‌ఆర్‌ సిపి సెంట్రల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు మూలింటి మారెప్ప, ఎస్‌సి సెల్‌ కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్‌ శుక్రవారం పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు లాగే మంద కృష్ణమాదిగ కూడా విశ్వసనీయత పోగొట్టుకున్నారని విమర్శించారు. మాదిగల కోసం వైయస్‌ ఏమీ చేయలేదని అవాస్తవాలు చెప్పడం మంద కృష్ణకు తగదన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, మాదిగలను వైయస్‌ మోసం చేశారనడం, చంద్రబాబు ఏదో ఒరగబెట్టారంటూ కితాబులివ్వడం పచ్చినిజాలను కప్పిపుచ్చడమేనని వారు వ్యాఖ్యానించారు. నిజానికి మాదిగలతో సహా వికలాంగులనీ, వితంతువులనీ, ముస్లింలనీ, బీసీలనీ, రైతాంగాన్నీ మోసం చేసినవాడు చంద్రబాబేనని వారు విమర్శించారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై అబద్ధపు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోబోమని వారు హెచ్చరించారు.
కేంద్రం నుండి వికలాంగులకు రూ.500 పింఛను వస్తే ఎన్టీఆర్‌ హయాంలో రూ. 50 ఇచ్చేవారనీ, చంద్రబాబు దానికి మరో రూ. 25 కలిపారనీ మారెప్ప వివరించారు. వికలాంగుల పెన్షన్‌లోంచి రూ.200 పక్కకు మళ్లించి మోసం చేసింది బాబేనని ఆయన గుర్తు చేశారు. వృద్ధాప్యపింఛన్లనూ ఇలాగే దారి మళ్లించారనీ, ఎస్సీఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులలో రూ.3000 కోట్లను డైవర్ట్‌ చేశారనీ ఆయన ఆరోపించారు. ఇలా సమాజంలోని అన్ని వర్గాలనూ మోసం చేసిన బాబుకు మంద కృష్ణ కొమ్ముగాయడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. 48 గంటల్లోనే వర్గీకరణ జీవోను బాబు చేశారంటున్నారనీ, నిజానికి ఆ జీవోలన్నీ జీవం లేనివేననీ ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్‌ ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఉషా మెహ్రా కమిషన్ వేసేలా చేశారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రపతులను, ప్రధానమంత్రులను తానే ప్రతిపాదించానని చెప్పుకునే బాబు ఆనాడు ఎబిసిడిని ఎందుకు సాధించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. వైయస్‌ను అనుకరిస్తూ బాబు చేస్తున్న పాదయాత్ర చూస్తుంటే పులిని చూసి నక్క వాత పెట్టుకుంటున్నట్లుగా ఉందని ఆయన వ్యంగ్యంగా అన్నారు.ఎబిసిడి వర్గీకరణ సామాజిక ఉద్యమమనీ, దానికి తాము కట్టుబడి ఉన్నామనీ ఆయన స్పష్టం చేశారు. 
మంద కృష్ణ రోజుకో పార్టీకి మద్దతు తెలుపుతూ మాదిగలను తికమకకు గురి చేయాలని చూస్తున్నారని నల్లా సుర్యప్రకాశ్‌ విమర్శించారు. రాజకీయపార్టీ పెడతానంటూ ప్రకటించి ఇప్పుడేమో చంద్రబాబును పొగుడుతూ తిరుగుతున్నారని, దీనికి బదులు మంద కృష్ణ పచ్చచొక్కా వేసేసుకుంటే బాగుంటుందని ఆయన ఎత్తి పొడిచారు. మాదిగలంతా వైయస్‌ కుటుంబంతోనే ఉన్నారనీ, జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారనీ ఆయన చెప్పారు. పత్తిపాడు, పాయకరావు పేట ఎన్నికలలో మాదిగలు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనే బలపరిచిన సంగతిని ఆయన గుర్తు చేశారు. వైయస్‌ కుటుంబం విశ్వసనీయత వల్లే మాదిగలు జగన్‌ వెంటనడుస్తున్నారని ఆయన అన్నారు.

Back to Top