మీ మంత్రులను విత్‌డ్రా చేసే దమ్ముందా బాబూ?

 
 
హైదరాబాద్‌: కేంద్రం పెద్దన్న పాత్ర పోషించడం లేదని, సుప్రీం కోర్టుకు వెళ్తామని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు  అన్నారు. బాబుకు దమ్ముంటే కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులను విత్‌డ్రా చేసి పోరాటం చేయాలని ఆయన సవాల్‌ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం తప్ప, చేసేది ఏమీ లేదని ఉమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. మీడియాతో ఉమ్మారెడ్డి మాట్లాడుతూ..మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు ఎందుకు ఇవాళ బీజేపీకి బద్నాం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ కూడా ప్రభుత్వంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంపై కూడా న్యాయస్థానానికి వెళ్తామంటారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ అన్ని రంగాల్లో పైస్థాయిలో ఉన్నామని చెప్పారు. దాన్ని సాకుగా చూపి కేంద్రంపై సుప్రీం కోర్టుకు వెళ్తామని చంద్రబాబు అనడంలో అర్థం లేదన్నారు. ఇది దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక విమానాలు, విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి ఏం మేలు జరిగిందని ఆయన నిలదీశారు. కేంద్రంపై విశ్వాసం లేకపోతే టీడీపీ మంత్రులను వెనక్కి పిలిచి పోరాటం చేయాలని గాని, అలాంటిది చేయకుండా ప్రజలను మభ్యపెట్టే విధంగా చంద్రబాబు వ్యవహరించడం సరికాదన్నారు. భాగస్వామ్యంగా ఉన్న ప్రభుత్వంపై సుప్రీం కోర్టుకు వెళ్తామనడంలో ఔచిత్యం ఏంటని ప్రశ్నించారు. ఇటీవల కేంద్రం నిర్వహించిన సర్వేలో వైయస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా రావడంతో రాష్ట్రానికి తాను ఏదో చేస్తున్నట్లు బిల్డప్‌ ఇచ్చేందుకు చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
 

తాజా ఫోటోలు

Back to Top