చిత్తూరు ప్రజలు సిగ్గుపడుతున్నారు


–నీటి ప్రాజెక్టులు పూర్తి చేయని చంద్రబాబు సిగ్గుపడాలి
– రుణమాఫీ పేరుతో రైతులను, మహిళలను మోసం చేసినందుకు సిగ్గుపడాలి.
చిత్తూరు: చంద్రబాబు చిత్తూరు జిల్లా వాసి అని చెప్పుకోవడానికి జిల్లా ప్రజలు సిగ్గుపడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. తనకు ఓటేయకపోతే ప్రజలే సిగ్గుపడాలన్న చంద్రబాబు వ్యాఖ్యలు దారుణమని ఆమె ఖండించారు. గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు నాలుగేళ్లు అదే పదవిలో కొనసాగుతున్నా..చిత్తూరు జిల్లాకు ఆయన చేసింది ఏమీ లేదని విమర్శించారు. లాభాల్లో ఉన్న విజయ డైరీని మూసివేసి, హెరిటేజ్‌ డైరీని ఏవిధంగా లాభాల బాటలో నడిపిస్తున్నారో అందరూ చూశారన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చక్కెర పరిశ్రమలు మూసివేశారని మండిపడ్డారు. వాటిని వైయస్‌ రాజశేఖరరెడ్డి తెరిపించినా మళ్లీ వాటిని మూత వేయించారని ఫైర్‌ అయ్యారు. గాలేరు–నగరి ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్‌లో కేటాయించకుండా ఇవాళ హంద్రీనీవా పూర్తి చేస్తానని చెప్పడం హాస్యస్పాదంగా ఉందన్నారు. సీమలోని నీటి ప్రాజెక్టులను పూర్తి చేయని చంద్రబాబు సిగ్గుపడాలని విమర్శించారు. రుణమాఫీ పేరుతో రైతులు, మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబు సిగ్గుపడాలని సూచించారు.
‘కొడుకు కోసం చంద్రబాబు క్షుద్రపూజలు’
  సీఎం చంద్రబాబు తప్పుకు మహిళా అధికారిణిని బలి చేశారని ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. విజయవాడ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో తాంత్రిక పూజలు జరిగినట్టు ఆరోపణలు రావడంలో ఆలయ ఈవో సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీ చేయ‌డంపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. కొడుకు కోసం క్షుద్రపూజలు చేయించిన చంద్రబాబు అడ్డంగా దొరికిపోయేసరికి నెపాన్ని అధికారులపైకి నెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, ఆయన కుమారుడు ఎప్పటికీ అధికారంలో ఉండాలన్న స్వార్థంతో దుర్గగుడిలో తాంత్రిక పూజలు చేయించారని అన్నారు. పవిత్రమైన అమ్మవారి సన్నిధిలో ఇలాంటి పూజలు చేయడం అరిష్టమని వ్యాఖ్యానించారు. గతంలోనూ ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి ఆ నెపాన్ని మహిళా అధికారి అనురాధపై నెట్టారని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలపై పీఠాధిపతులు చంద్రబాబును నిలదీయాలని ఎమ్మెల్యే రోజా అన్నారు.


 
 
Back to Top