చంద్రబాబు మద్దతుతోనే రాష్ట్ర విభజన కుట్ర

తిరుపతి :

చంద్రబాబు నాయుడి మద్దతుతోనే రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు సోనియా గాంధీ కుట్ర పన్నుతున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. తిరుపతి తుడా సర్కిల్‌లోని వైయస్ఆర్ విగ్రహం వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా ‌పార్టీ నాయకులు చేస్తున్న రిలే దీక్షలకు శనివారం పార్టీ నాయకులు ఆదం రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆటోనగర్‌ నాయకులు మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి శిబిరం వద్దకు వచ్చి దీక్షాపరులకు పూలమాలలు వేసి దీక్షలో పాల్గొన్నారు.

ఆ తరువాత భూమన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు చంద్రబాబు నాయుడే ఆజ్యం పోశారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు రాజకీయాలకు సీమాంధ్రులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మామనే వెన్నుపోటు పోడిచి చంద్రబాబు పదవిలోకి వచ్చారని, నమ్మినవారిని నట్టేట ముంచడం ఆయన నైజంగా మారిందని విమర్శించారు. ఎక్కడ ఆంటోనీ కమిటీ సీమాంధ్రులకు అనుకూలంగా నివేదిక ఇస్తుందో అని అర్ధాంతరంగా బస్సు యాత్రను పక్కనపెట్టి ఢిల్లీకి పరుగులు పెడుతున్నారన్నారు.

దానితో పాటు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్ పిటిష‌న్‌ను అడ్డుకునేందుకు సోనియా కాళ్లను పట్టుకునేందుకు వెళుతున్నారని భూమన విమర్శించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి బయటకు వస్తున్నారంటే కిరణ్, చంద్రబాబుకు గుండెల్లో దడ మొదలవుతుందన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసే హక్కు సోనియాకు లేదన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రకు తాగునీరు, సాగునీరు, విద్యుత్ లేక ఏడారిగా మారే పరిస్థితి ‌ఉందన్నారు. విద్యార్థుకూ నిరాశే ఎదరవుతుందని తెలిపారు.

సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు నిజంగా ప్రజలపై మమకారం ఉంటే వెంటనే పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. సమైక్య‌ రాష్ట్రం కోసం 45 రోజులుగా అలుపెరగని ఉద్యమం చేస్తున్నది ఒక్క వైయస్ఆర్‌ కాంగ్రెస్ ‌పార్టీయేనని ఆయన గుర్తుచేశారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

తాజా వీడియోలు

Back to Top