ఇది రైతు వ్యతిరేక సంవత్సరంగతంలో రైతులను చంద్రబాబు పిట్టల్లా కాల్చారు
ప్రస్తుతం వ్యవసాయ రంగాన్ని మోసగించే పరిస్థితి
ల్యాండ్‌ పూటింగ్‌ పేరుతో అన్నదాతల భూమి లాక్కోవడం
2013 భూసేకరణ చట్టం సవరణ
విశాఖలో లక్ష ఎకరాలను ఆక్రమించుకోవడం
ఇనుము ఏమైందంటే ఎలుకలు తిన్నాయన్నట్లుగా చంద్రబాబు తీరు
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు వ్యతిరేకి, కూలీల ద్వేషి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో హైదరాబాద్‌లో నిరసన తెలుపుతున్న రైతులను పిట్టలను కాల్చినట్లు కాల్చినప్పుడే చంద్రబాబు ధోరణి అందరికీ అర్థమైందన్నారు. అదే తరహాలో ప్రస్తుతం ఏపీలో కూడా రైతు వ్యతిరేక పరిపాలన చేపడుతున్నారన్నారు. అందుకే ఈ సంవత్సరంను రైతు వ్యతిరేక సంవత్సరంగా, ల్యాండ్‌ గ్రాబింగ్‌ ఇయర్‌గా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటిస్తుందన్నారు. విశాఖలో లక్షల ఎకరాలు, ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో వ్యవసాయ భూములు, 2013 భూసేకరణ చట్టాన్ని దొంగచాటుగా సవరణ చేసి రాష్ట్రాన్ని అడ్డగొలుగా దోచుకుంటున్నాడని మండిపడ్డారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2017లో చంద్రబాబు చేసిన మూడు ప్రధానమైన మోసాల వివరించారు. 

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత విశాఖలో లక్ష ఎకరాలను కబ్జా చేశాడని ఆర్కే మండిపడ్డారు. హుద్‌హుద్‌ తుఫాన్‌ పేరుతో ల్యాండ్‌ రికార్డులను తారుమారు చేశారన్నారు. ఇనుమేమైపోయిందంటే ఎలుకలు తిన్నాయి అన్నట్లుగా చంద్రబాబు పరిస్థితి ఉందన్నారు. భూకబ్జాల వెనుక మంత్రి ఉన్నాడని టీడీపీ మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పారని గుర్తు చేశారు. పేదవాడు తినితినక, మధ్యతరగతి ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను కొట్టేయాలని చంద్రబాబు ఆఖరికి ఆ మంత్రుల మధ్య సయోధ్య కూడా కుదిర్చారన్నారు. భూ ఆక్రమణలపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ సీపీ కోరితే సిట్‌ అనే దాన్ని వేస్తున్నట్లు ప్రకటించారన్నారు. ఆ రోజు నుంచి నేటి వరకు సిట్‌ సిట్టింగ్‌లోనే ఉంది కానీ, ఒక్క నివేదిక కూడా విడుదల చేయలేదన్నారు. 

అక్రమంగా ల్యాండ్‌ పూలింగ్‌ అనే చట్టాన్ని తీసుకువచ్చి తద్వారా రాజధాని ప్రాంతంలో ఎకరం, రెండు ఎకరాలు ఉన్న రైతులను భయపెట్టి 33 వేల ఎకరాలను చంద్రబాబు సేకరించారని ఆర్కే గుర్తు చేశారు. సుమారు 7–8 వేల ఎకరాల రైతులు గౌరవ న్యాయస్థానాలకు వెళితే వారిని భయపెట్టేందుకు ఈ రోజుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. స్వచ్ఛందంగా భూమి ఇచ్చిన రైతులకు ఇప్పటి వరకు న్యాయం చేశావా..చంద్రబాబూ అని ఆర్కే ప్రశ్నించారు. చంద్రబాబు ల్యాండ్‌ పూలింగ్‌తో వారంతా గాలిలో కొట్టుకుపోయారని, కూలిలు అడ్రస్‌ లేకుండా పోయారని, కౌలు రైతులు మాయమైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ వ్యవస్థ మొత్తం ల్యాండ్‌ పూలింగ్‌ అనే అక్రమ చట్టంతో కూరుకుపోయిందన్నారు. అంతే కాకుండా అటవిశాఖ భూమి 50 వేల ఎకరాలు కాజేయడానికి వేసిన పన్నాగాన్ని కేంద్రం అడ్డుకుందన్నారు. చంద్రబాబు నాలుగు సంవత్సరాల్లో ఇప్పటి వరకు పేదవాడిని పట్టించుకున్న పాపాన పోలేదని, బాబు వృత్తి ఒక్కటే పేదవారి ఆస్తులు కాజేసీ లక్షల కోట్ల సంపాదించడమేనన్నారు. తనకు అనుకూలమైన చానల్స్‌ ద్వారా బ్రహ్మాండమైన రాజధాని కడుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటాడన్నారు. ఇప్పటి వరకు రాజధానిలో శాశ్వతం అనే పేరుతో ఇటుకపడిందా చంద్రబాబు అని ప్రశ్నించారు. వేలకు వేలు కాంట్రాక్టర్‌లకు ముట్టజెప్పి చిన్నపాటి వర్షాలకే జోరున కురిసే తాత్కాలిక భవనాలు కట్టించారన్నారు. 

ప్రతిపక్షం లేకుండా 2013 భూసేకరణ చట్టాన్ని సభలో సవరణ చేయడం సిగ్గులేని పని అన్నారు. చట్టంలో సవరణలు చేయాలంటే అర్థవంతమైన చర్చలు జరగాలని, సభ్యులు, మేధావుల సలహాలు తీసుకోవాలనే జ్ఞానం బాబు లేదా అని ప్రశ్నించారు. కేంద్రం ప్రభుత్వం తయారు చేసిన చట్టంలోని సెక్షన్‌ 10కి సవరణ చేశారని, మూడు పంటలు పండే భూమిని తీసుకోవడానికి వీళ్లేదని చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. అలాంటి చట్టాన్ని బాబు తన రియలెస్టేట్‌ వ్యాపారం కోసం మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఆలోచిస్తే దాన్ని చంద్రబాబు అపహాస్యం చేశారన్నారు. ఇప్పటికైనా నీ బుద్ధిని మార్చుకోవాలని చంద్రబాబుకు సూచించారు. రైతు రాజు కావాలని ఆకాంక్షించిన దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. రాబోయే రాజన్న రాజ్యంలో నీ నుంచి మోసపోయిన ప్రతి పేదవాడికి అంగుళం భూమితో సహా అందిస్తామన్నారు. 
 
Back to Top