మతరాజకీయం చేసేవారు పిరికిపందలు!

మాల్ (నల్గొండ) 2 పిబ్రవరి 2013 : "నా మోకాలికి గాయం తగలలేదనీ, ఆపరేషన్ జరగలేదనీ నిరూపిస్తారా?" అని శ్రీమతి వై యస్ షర్మిల టీడీపీకి సవాలు విసిరారు. అలా నిరూపిస్తే తాను వాళ్ల కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతాననీ, అలా కాకుండా తన కాలికి దెబ్బ తగిలిందనీ, ఆపరేషన్ జరిగిందనీ రుజువు చేస్తే తన కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతారా? అని ఆమె వారిని సూటిగా ప్రశ్నించారు. నల్గొండజిల్లా దేవరకొండ నియోజక వర్గం మాల్‌లో శుక్రవారం జరిగిన ఒక భారీ బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. కాలిగాయంపై టీడీపీ నేతలు కొందరు చేస్తున్న చౌకబారు ఆరోపణలను ఆమె ప్రస్తావించారు. అలాగే తన భర్త బ్రదర్ అనిల్ కుమార్‌పై బీజేపీ నాయకులు కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఆమె తిప్పికొట్టారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసేవారు పిరికిపందలని ఆమె దుయ్యబట్టారు. ఇలాంటి ఆరోపణల వెనుక చంద్రబాబు స్క్రీన్ ప్లే, కథా, డైరెక్షన్ ఉన్నాయని ఆమె విమర్శించారు. నిజాలు చెప్పే సాక్షి పత్రిక,  ప్రజల మానస పుత్రిక అని ఆమె వ్యాఖ్యానిస్తూ చంద్రబాబు ఆరోపణలను తూర్పారబట్టారు. 

శ్రీమతి షర్మిల మాటల్లోనే...

"చంద్రబాబు నాయుడుగారు, ఆయన పార్టీవారు కలిసి చాలా గాలిమాటలు మాట్లాడుతున్నారు ఈ మధ్య. నా మోకాలికి దెబ్బ తగలనే లేదట. నాకు ఆపరేషన్ జరగనే లేదట. నేను నాటకాలు చేస్తున్నానట. ఇక్కడ ఒక సంఘటన గుర్తు చేయాలి. చంద్రబాబుగారిపై అలిపిరిలో బాంబుదాడి జరిగింది. అప్పుడు రాజశేఖర్ రెడ్డిగారు వెళ్లి మౌనదీక్ష చేసి ఆ దాడికి నిరసన ప్రకటించారు. విమానాశ్రయానికి వెళ్లి చంద్రబాబును కూడా పరామర్శించారు. అదీ రాజశేఖర్ రెడ్డిగారి సంస్కృతి. చంద్రబాబునాయుడుగారి స్టేజి కూలిపోయి గాయాలైనప్పుడు మా పార్టీ ఏమీ మాట్లాడలేదు. మా పార్టీవారు దానిని హేళన చేసి మాట్లాడింది లేదు. అది మా సంస్కృతి. 
కానీ కూతురు వయసున్న ఒక మహిళపై నిజాలేమిటో తెలుసుకోకుండా ఇంత అభాండాలు వేయడానికి వాళ్ల సంస్కారం అడ్డురాలేదేమో తెలియదు మరి.
నా మోకాలికి గాయం కాలేదనీ, నాకు ఆపరేషన్ జరగలేదనీ మీరు నిరూపిస్తే నేను మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెపుతాను. మరి నా కాలికి దెబ్బ తగిలిందనీ, నా మోకాలికి ఆపరేషన్ అయిందనీ నేను నిరూపిస్తే మీరొచ్చి నా కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతారా? 
చంద్రబాబు నాయుడుగారి స్క్రీన్ ప్లే , కథా, డైరెక్షన్‌లో ఇప్పుడు బీజేపీవాళ్లు కూడా చాలా మాట్లాడుతున్నారు.  నా భర్త దేవసేవ చేస్తారని, మా పార్టీని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా వైయస్ఆర్ క్రిస్టియన్ పార్టీగా కొత్త అర్థం చెబుతున్నారు. దానికి ఒకటే సమాధానం. ప్రేమకు మతం లేదు. అభిమానానికీ మతం లేదు. మంచితనానికీ మతం లేదు. అందుకే రాజశేఖర్ రెడ్డిగారికి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా కోట్లకొద్దీ మంది అభిమానిస్తున్నారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసేది పిరికిపందలు.
ఇక చంద్రబాబుగారు సాక్షిని విషకన్య అన్నారు. సాక్షి ఒక విషకన్య కాదు, దేవకన్య కూడా కాదు. సాక్షి ప్రజలకు నిజం చెప్పడానికి పుట్టిన ఒక మానసపుత్రిక. చంద్రబాబుగారికి రెండు పేపర్లు, నాలుగు చానళ్లు ఆయన జపమే చేస్తుంటాయి. జాతీయ స్థాయిలో కూడా ఆయన మీడియాను గొప్పగా మేనేజ్ చేస్తుకుంటారు. అయినా మీకు సాక్షి అంటే ఎందుకండీ అంత బెదురు? చంద్రబాబు ఆడిన ప్రతి అబద్ధానికీ ఇదీ నిజమని చెప్పినందుకా సాక్షి అంటే మీకంత భయం?" అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు.

ఇది చంద్రబాబు పరిపాలన పార్ట్ -2

చిల్లర వర్తకంలో విదేశీపెట్టుబడుల వల్ల లక్షల మంది నష్టపోతారని తెలిసి కూడా చంద్రబాబు రాజ్యసభలో తన ముగ్గురు ఎంపీలను గైర్హాజరు చేయించి దేశప్రయోజనాలకు నష్టం కలిగించారని ఆమె విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు పరిపాలన పార్ట్ -2 అని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. 46 ప్రభుత్వ రంగ సంస్థలను మూయించి, ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వబోదని చెప్పిన ఘనుడు చంద్రబాబు అని ఆమె తూర్పారబట్టారు. ఈ ప్రభుత్వంపై ఎవరికీ భరోసా లేదనీ, ఒక్క చంద్రబాబుకు మాత్రమే భరోసా ఉందనీ ఆమె పేర్కొన్నారు. రోజూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టే చంద్రబాబు అవిశ్వాసం మాత్రం పెట్టనంటున్నారని ఆమె ఎండగట్టారు. మొదట్లో రెండెకరాల ఆస్తి మాత్రమే ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు దేశంలోనే అతి సంపన్నుడైన రాజకీయవేత్త అని తెహల్కాయే తేల్చి చెప్పిందని ఆమె అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలు ఆయన మీద దర్యాప్తు జరగకుండా ఉండడం అవసరమనీ కనుక ఆయన ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడనీ ఆమె విమర్శించారు. ప్రభుత్వం కూలిపోదని నమ్మకం కుదిరి కాంగ్రెస్ వాళ్లు పచ్చజెండా ఊపాకే చంద్రబాబు అవిశ్వాసం పెడతారని శ్రీమతి షర్మిల వ్యంగ్యంగా అన్నారు. చిరంజీవి పార్టీ కాంగ్రెస్‌లో కలిశాక మాత్రమే గతంలో చంద్రబాబు అవిశ్వాసం పెట్టారని ఆమె గుర్తు చేశారు. ఒక ముఖ్యమంత్రిగానే కాదు, చంద్రబాబు ఒక ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడని మళ్లీ మళ్లీ నిరూపించుకుంటున్నారని ఆమె ఎత్తిపొడిచారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరస్పరం కాంగ్రెస్, టీడీపీలు సహకరించుకున్నాయని ఆమె విమర్శించారు.

ఈ రెండు పార్టీలకూ ఒకటే ఎజండా...టార్గెట్ జగన్!

"కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు పచ్చినిజం. ఎందుకంటే ఈ రెండు పార్టీలకూ ఒకటే ఎజండా, ఒకటే టార్గెట్...అది జగన్. విలువలకు, విశ్వసనీయతకు, నిజాయితీకి మారుపేరుగా నిలచి జగనన్నమీ మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్నాడనీ, రైతుల కోసం, చేనేతల కోసం, విద్యార్థుల కోసం రోజుల తరబడి నిరాహార దీక్షలు చేస్తూ ప్రజల మధ్యనే ఉంటూ మీ మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్నాడనీ అదే గనక జరిగితే తమ రెండు పార్టీలకూ ఇక మనుగడ ఉండదనీ, తమ దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందనీ కుట్రలు పన్ని జగనన్నను జైలు పాలు చేశారు. జగనన్న ఏ తప్పూ చేయలేదు. జగనన్నకు వ్యతిరేకంగా ఏ ఆధారాలూ లేవు. కానీ అధికారాన్ని ఇష్టమొచ్చినట్లు వాడుకుని సీబీఐని ఉపయోగించుకుని జగనన్నని జైలు పాలు చేశారు. కానీ దేవుడు ఉన్నాడు. మంచివాళ్ల  పక్షాన నిలబడతాడు. ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న వస్తాడు. రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు." అని ఆమె ధీమాగా అన్నారు.  అంతవరకు జగనన్నను ఆశీర్వదించాలనీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలనీ శ్రీమతి షర్మిల ప్రజలను కోరారు.



 


Back to Top