‘మరో ప్రజా ప్రస్థానం’కు అపూర్వ స్పందన

బాలానగర్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు గ్రామగ్రామాల నుంచి అపూర్వ స్పందన వస్తోందని పార్టీ నేత, దివంగత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి చెప్పారు. తెలంగాణలో ప్రవేశించిన షర్మిలకు స్వాగతం పలికేందుకు ఆమె జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా బాలానగర్‌లో ఆమె మాట్లాడుతూ తమకు మనుగడ ఉండదనే భయంతో వైయస్ జగన్మోహన్‌ రెడ్డిని జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అలాగే దివంగత మహానేత వైయస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఒక్కొక్కటిగా తీసివేయాలని చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రతిపక్ష నేత అసమర్థ విధానాలను తూర్పార పడుతూనే ప్రజల సమస్యలను తెలుసుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల నూతన ఒరవడిని సృష్టిస్తున్నారని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో తిరిగి రాజన్న రాజ్యం వస్తోందని ఆమె పేర్కొన్నారు.

Back to Top