మరోమారు ప్రజల చెంతకు వైయస్ కుటుంబం

నాడు

రాష్ట్ర ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్టాలను కళ్లారా తెలుసుకునేందుకు వైయస్ సంకల్పించారు. మండుటెండలో సుమారు 1500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. వైయస్ సీఎం అయితే తమ కష్టాలు తీరుతాయని రాష్ట్ర ప్రజలు భావించారు. ఒకసారి కాదు.. రెండు సార్లు వైయస్ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీకి పట్టం గట్టారు. ప్రజల నమ్మకాన్ని వైయస్ ఏనాడూ వమ్ము చేయలేదు. ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో కొలువయ్యారు.

నేడు
మహానేత వైఎస్ సంక్షేమ పథకాలను పాలకులు అటకెక్కించారు. వైయస్ కుటుంబంపై కక్షగట్టారు. జననేత జగన్‌ను జైలుపాలు చేశారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుండటంతో మరో ప్రజా ప్రస్థానం అవసరమైంది. వైయస్ స్ఫూర్తితో ఆయన కుమార్తె షర్మిల ఈనెల 18న ఇడుపులపాయలో పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ యాత్ర సుమారు 3000 కి.మీ.లు కొనసాగి ఇచ్ఛాపురంలో ముగుస్తుంది.

కడప: పచ్చటి పంటలతో కళకళలాడాల్సిన పల్లెలు కళావిహీనమయ్యాయి. ఎండ పడివస్తే గ్లాసు మజ్జిగ ఇచ్చి సేద దీరమని చెప్పే గ్రామీణులు గొంతెండి వచ్చినా మంచినీళ్లు ఇవ్వలేని దౌర్భగ్యం. వరుణుడి కాఠిన్యం, పాలకుల నిర్లక్ష్యంతో పశుపక్ష్యాదులు దాహంతో అలమటిస్తున్నాయి. దీంతో మరో ప్రజాప్రస్థానం పునరావృతం కానున్నది. పదేళ్ల కిందట ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి మండుటెండలో పాదయాత్ర నిర్వహించారు.
అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. మహానేత స్ఫూర్తితో ఆయన కుమార్తె షర్మిల మరో ప్రస్థానానికి శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్ ఘాట్ పాదాల చెంత నుంచి ఈనెల 18న పాదయాత్ర ప్రారంభం కానుంది. జిల్లాలోని ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర పులివెందుల నియోజకవర్గం నుంచి అనంతపురం జిల్లాలోకి వెళుతుంది. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో కొనసాగే ఈ పాదయాత్ర సుమారు మూడు వేల కిలోమీటర్లుసాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది.
రాయలసీమ ఉద్యమంతో పాదయాత్రలు
వరుస కరువులతో అల్లాడుతూ వచ్చిన రాయలసీమ జిల్లాల దుస్థితికి అప్పటి నేతలు చలించిపోయారు. కరువుకు శాశ్వత నివారణ సాగునీటి ప్రాజెక్టులే శరణ్యమని అప్పటి రాయలసీమ నేతలు ఉద్యమానికి నడుం బిగించారు. జిల్లాకు చెందిన వైయస్ రాజశేఖరరెడ్డి, ఎంపీ మైసూరారెడ్డి, ఎంవీ రమణారెడ్డి, సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, శివరామకృష్ణయ్యలాంటి నేతలు పాదయాత్రకు రూపకల్పన చేశారు.
రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి పాదయాత్ర చేపట్టేలాగా నిర్ణయించి అనంతపురం జిల్లాలో కదలిక మాసపత్రిక ఎడిటర్ ఇమాం, న్యాయవాది శ్రీధర్, రెడ్డెప్పరెడ్డిలాంటివారు, చిత్తూరు నుంచి భూమన్, కర్నూలు నుంచి శేషశయనారెడ్డి, రఘురామిరెడ్డి వంటి నేతలు ఏకకాలంలో ఆయా ప్రాంతాల్లో పాదయాత్రలు నిర్వహించారు. అందరి నేతల పాదయాత్ర పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు చేరుకునేలా అప్పట్లో రూట్‌మ్యాప్ తయారు చేసుకొని, ఆ విధంగా తొలిసారి పాదయాత్ర రాయలసీమలో చేపట్టారు. తర్వాత కాలంలో గాలేరు-నగరి సుజల స్రవంతి సాధన కోసం మాజీమంత్రి ఎంవీ మైసూరారెడ్డి గండికోట నుంచి నగరి వరకు పాదయాత్ర చేశారు.
రాయలసీమ ఉద్యమంలో చేపట్టిన పాదయాత్ర స్ఫూర్తితో రాష్ట్రంలో వరుస కరువుల నేపథ్యంలో 2003 ఏప్రిల్ 9వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి సీఎల్పీ నేతగా ఉన్న అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైయస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రకు పూనుకున్నారు. 2003 జూన్ 15 వరకు సాగిన పాదయాత్ర సుమారు 1500 కిలోమీటర్లు తర్వాత శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడం, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ప్రజారంజక పాలన సాగింది.
మరో ప్రస్థానంతో ప్రజల చెంతకు....
పల్లెలన్నీ ఘొల్లుమంటున్నా పట్టించుకునే పాలకులు లేరు. ప్రజానీకానికి అండగా నిలవాల్సిన ప్రతిపక్షం అధికార పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తోంది. లోపాయికారి ఒప్పందాలతో దాడుగుమూతల రాజకీయాలు చేయడంలో తెలుగుదేశం పార్టీ ఆరి తేరుతోంది. మహానేత తనయుడు, కడప ఎంపీ  జగన్‌మోహన్‌రెడ్డిపై కుట్రలు పన్ని జైలుపాలు చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు అండగా తామున్నామంటూ మరో ప్రస్థానం పేరున వైయస్ కుటుంబం ప్రజల చెంతకు వెళ్లనుంది.

Back to Top