బాక్సైట్ తవ్వితే బాక్సింగే..!

తవ్వకాలకు అనుమతివ్వడంపై ప్రజాగ్రహం..!
జిల్లావ్యాప్తంగా నిరసనలు..మన్యం బంద్..!

విశాఖపట్నంః బాక్సైట్ తవ్వకాలకు టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై విశాఖ మన్యం నిప్పులు కక్కుతోంది. ఆనాడు బాక్సైట్ తవ్వకాలను రద్దు చేయాలంటూ విల్లంబులు పట్టుకొని ఉద్యమిస్తానన్న చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక ఆదివాసీలపై పడగ విప్పుతున్న వైనంపై గిరిజనం మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లావ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రాణాలు అడ్డుపెట్టయినా బాక్సైట్ తవ్వకాలను అడ్డుకోవాలని పాడేరులో జరిగిన అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. ఈమేరకు ఇవాళ మన్యం బంద్‌కు పిలుపు నిచ్చింది. 

ఉద్యమాన్ని అడ్డుకునే కుట్ర..!
అఖిల పక్ష సమావేశానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధ్యక్షత వహించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ పాడేరులో బైక్ ర్యాలీ తీశారు. ఏజెన్సీలోని 11 మండలాల్లో ఇక నుంచి ఐక్య ఉద్యమాలను తీవ్రతరం చేయాలని తీర్మానించారు. బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిచ్చిన సర్కార్ ఉద్యమాన్నిఅణిచేందుకు... పోలీసుల నిర్బంధాలు, తప్పుడు కేసులు బనాయించడం వంటి  చర్యలకు పాల్పడే అవకాశం ఉందని ఈశ్వరి అన్నారు. ముగ్గురు ఆదివాసీలను మావోలు కిడ్నాప్ చేసినప్పుడు తవ్వకాలు జరపబోమని అర్ధరాత్రి ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించిన సీఎం చంద్రబాబు ...ఇప్పుడు తన చుట్టూ ఉండే పారిశ్రామిక కోటరీ కోసమే అనుమతులిచ్చారని ఆమె విమర్శించారు. 
 
ఉన్నతాధికారుల ఏరియల్‌సర్వే..!
బాక్సైట్ తవ్వకాలకై జీవో జారీ చేసిన మర్నాడే సీఆర్‌పీఎఫ్ ఏడీజీ(అడిషనల్ డెరైక్టర్ జనరల్) పి.వి.కె.రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక ఉన్నతాధికారుల బృందం శుక్రవారం ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు (ఏవోబీ)  ప్రాంతంలో పర్యటించింది. ప్రత్యేక హెలికాప్టర్‌లో ఢిల్లీ నుంచి  చేరుకున్న ఈ బృందం ముంచంగిపుట్టు, మల్కన్‌గిరిలలో  సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంపులను తనిఖీ చేసింది. బాక్సైట్ తవ్వకాలు చేపడితే గిరిజనుల నుండి తీవ్ర ప్రతిఘటన తప్పదని భావిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులను దింపే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
Back to Top