మంత్రి సారధిపై కేసు నమోదుకు ఆదేశం

విజయవాడ: ఎన్నికల అఫిడవిట్‌లో ఫెరా ఉల్లంఘన కేసులో శిక్ష గురించి ప్రాథమిక విద్య శాఖ మంత్రి కె. పార్థసారథి పేర్కొనకపోవడాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ తప్పుపట్టింది. దీనిపై తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ మంత్రిపై స్థానిక కోర్టులో పిటిషన్ వేయాల్సిందిగా రిటర్నింగ్ అధికారి అయిన కృష్ణా జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాశ్ ఎం.జ్యోతిని కమిషన్ ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గానికి పార్థసారథి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫెరా ఉల్లంఘన కేసు వివరాలను 2004, 2009 ఎన్నికల అఫిడవిట్లలో ఆయన పేర్కొనలేదన్న ఫిర్యాదుపై ఈసీ ఆదేశం మేరకు కలెక్టర్ విచారించి, అది నిజమేనని నివేదిక పంపారు. నివేదికపై ఈసీ తాజా ఆదేశాల మేరకు సారథిపై కలెక్టర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. కేపీ టెలి కంపెనీలకు విదేశాల నుంచి యంత్రాల కొనుగోలులో పార్థసారథి ఫెరా నిబంధనలు పాటించలేదన్నది ఆరోపణ. దానిపై రూ.3 లక్షలు జరిమానా విధించింది. సారథి జరిమానా చెల్లించకపోవడంతో ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టును ఈడీ ఆశ్రయించింది. గత జూలైలో ఆయన రెండు నెలల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఫెరా ఉల్లంఘనల కేసు తాను రాజకీయాల్లోకి రాక ముందుదని మంత్రి పార్థసారథి చెబుతున్నారు.

Back to Top