నర్సారావుపేట: గతంలో ఎప్పుడూ లేని విధంగా పల్నాడులో, ముఖ్యంగా గురజాలలో డయేరియా విజృంభిస్తోందని, వ్యాధికి ఇప్పటికే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురజాలలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్న ఆయన, కలుషిత నీటికి పేదలు ప్రాణాలు కోల్పోతున్నారని, ఆ నీటి సమస్యపై కౌన్సిలర్లు ఫిర్యాదు చేసినా, మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవడం లేదని తెలిపారు. డయేరియా మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, వారికి ప్రభుత్వం తక్షణం రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నర్సారావుపేటలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. దోచుకుందాం.. పంచుకుందాం అనే యావ తప్ప, ప్రజారోగ్యం గురించి పట్టించుకునే తీరిక ఈ ప్రభుత్వానికి లేదని మాజీ ఎమ్మెల్యే ఆక్షేపించారు. ఎంతసేపూ వైన్‌షాపులు, బెల్ట్ షాపులు, మైన్స్, పేకాట క్లబ్బులు, ఎవరికెంత వాటాలు పంచాలని ఆలోచిస్తున్నారు తప్ప.. కరవొచ్చినా, వరదొచ్చినా కనీసం స్వచ్ఛమైన తాగు నీరు కూడా అందించ లేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. కూటమి నాలుగు నెలల పాలనలోనే పిడుగురాళ్ల మున్సిపాలిటీ లెనిన్‌నగర్‌లో ఐదుగురు, నిన్న (గురువారం) దాచేపల్లి పట్టణం అంజనాపురంలో ఇద్దరు డయేరియాతో చనిపోయారని కాసు మహేష్‌రెడ్డి వెల్లడించారు. తమ ప్రభుత్వ హయాంలో, గత 5 ఏళ్లలో ఏనాడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో తవ్వించిన బోరుబావి నీటి సరఫరా ఇష్టం లేక, మరో బోరు బావి నుంచి నీరు సరఫరా చేయడమే డయేరియా అనర్థానికి కారణమని చెప్పారు. జనం పన్ను సొమ్ముతో తవ్వించిన బోర్లపై రాజకీయాలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. గురజాలలో సురక్షిత నీటి సరఫరా కోసం కేంద్రంతో మాట్లాడి రూ.300 కోట్లతో పథకాలు మంజూరు చేయించామని, కూటమి ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని, వాటిని పూర్తి చేయాలని కోరారు. డయేరియా బాధిత కుటుంబాలను ఆదుకోకపోతే, వారి పక్షాన నిలబడి పోరాడతామని మహేష్‌రెడ్డి హెచ్చరించారు