మంచినీళ్ళిచ్చే మనసు లేని ప్రభుత్వం

పిడుగురాళ్ళ (గుంటూరు జిల్లా), 28 ఫిబ్రవరి 2013: పైపులైన్లు వేసి పిడుగురాళ్ళ ప్రాంతానికి కృష్ణానది ద్వారా మంచినీరు తేవాలని మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి కృషి చేశారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. అందు కోసం ఆయన శంకుస్థాపన కూడా చేసిన వైనాన్ని గుర్తుచేశారు. ఆయన బ్రతికి ఉండగానే 80 శాతం పనులను పూర్తి చేశారన్నారు. అయితే, ఆయన మరణించడంతో మిగిలిన 20 శాతం పనులను పూర్తి చేయకుండా ఈ ప్రభుత్వం ప్రజలు దప్పికతో అల్లాడిపోయేలా చేస్తోందని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. పిడుగురాళ్ళకు మంచినీళ్ళిచ్చే చిత్తశుద్ధి ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేదని ఆమె ఆరోపించారు. మరో ప్రస్థానం పాదయాత్రలో భాగంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల గురువారం గుంటూరు జిల్లా పిడుగురాళ్ల బహిరంగ సభలో మాట్లాడారు.

స్థానికంగా ఉన్న సున్నపురాయి పరిశ్రమలో దాదాపు 25 వేల మంది పనిచేస్తున్నారని, కానీ ఇప్పుడు బొగ్గు లేక, విద్యుత్‌ సరఫరా లేక వారిలో సగం మంది ఉపాధి కోల్పోతున్నారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. సగం పరిశ్రమలు మూతపడే స్థితిలో ఉన్నాయని, అయినా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవడం లేదని నిప్పులు చెరిగారు. విద్యుత్‌ సంక్షోభం మొత్తం మన రాష్ట్రాన్నే ఇబ్బందిగా మార్చిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్లక్ష్యం, ముందుచూపు లేని కారణంగానే తీవ్ర విద్యుత్‌ సంక్షోభం వచ్చిందని శ్రీమతి షర్మిల ఆరోపించారు.

దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి నీళ్ళతో పాటు 7 గంటల పాటు ఉచిత విద్యుత్‌ సరఫరా చేశారని శ్రీమతి షర్మిల అన్నారు. విత్తనాల ధరలు తగ్గించారని, ఎరువుల ధరలు పెరగనివ్వలేదన్నారు. పంటలకు మద్దతు ధర కల్పించారని, నష్టం వస్తే పరిహారం కూడా ఇచ్చారన్నారు. మన రైతులకు రూ. 12 కోట్లతో రుణ మాఫీ కూడా చేశారన్నారు. ఇప్పుడు రైతులకు ఆ పరిస్థితి లేదన్నారు. మహానేత ఉన్నప్పుడు మిర్చి రైతులు రూ. 12 వేలు ధర పలికిందన్నారు. ఇప్పుడు కేవలం రూ. 5 వేలు మాత్రమే ఉన్నదన్నారు. మొన్నటి వానలకు మిర్చి పంట తడిసిపోతే రూ.3 వేలకు కూడా కొనే నాథుడు లేడని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వల్ల పత్తి, వరి, మొక్కజొన్న రైతులందని పరిస్థితి కూడా ఇంతకంటే భిన్నంగా లేదన్నారు.

రాజశేఖరరెడ్డి బ్రతికి ఉంటే ఇప్పుడు 9 గంటలు ఉచిత విద్యుత్‌ ఇచ్చిఉండేవారని శ్రీమతి షర్మిల చెప్పారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం 9 గంటలు, 7 గంటలు కాదుగదా 3 గంటలు కూడా సరఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో తెలియక ప్రతి కుటుంబంలోనూ ఒక వ్యక్తి 24 గంటలూ కాపలా కాయాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. రైతుల ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే‌ సిఎం కిరణ్ కుమార్‌రెడ్డి బాధ్యత వహిస్తారా అని ఆమె నిలదీశారు. గ్రామాల్లో ఎక్కడా కరెంటు ఇవ్వరు గానీ బిల్లులు మాత్రం రెండు మూడు రెట్లు వసూలు చేయడమేమిటని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. చార్జీలు, సర్‌చార్జీల నెపంతో ఈ ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు విద్యుత్‌ ధరలు పెంచేసిందని నిప్పులు చెరిగారు. విద్యుత్‌ చార్జీల కింద ప్రజల నుంచి ఏకంగా రూ. 32 వేల కోట్లు వసూలు చేస్తున్నదన్నారు.

మహానేత వైయస్‌ రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మొదటి ఐదేళ్ళలో విద్యుత్‌ చార్జీలు పెంచలేదని, వచ్చే ఐదేళ్ళలోనూ పెంచబోనని హామీ ఇచ్చిన విషయాన్ని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. వైయస్‌ఆర్ రెక్కల కష్టం మీద  అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఆయన మాటకు విలువ ఇవ్వడంలేదని విమర్శించారు. పరిశ్రమలకు పవర్‌కట్‌ విధించిందని, దానితో అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు.

ఇంటి పిల్లికి పొరుగు పిల్లి తోడైన విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి టిడిపి తోడైందని శ్రీమతి షర్మిల ఆరోపించారు. ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం చొక్కా పట్టుకుని నిలదీయాల్సి బాధ్యత గల ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెట్టక పోగా దానికే వత్తాసుగా ఉన్నారని నిప్పులు చెరిగారు. పొద్దున లేచిన దగ్గర నుంచీ జగనన్నను, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని‌ చంద్రబాబు విమర్శించడంమే పనిగా పెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలబడడం తప్పితే చంద్రబాబు ఏమీ చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకు మాత్రమే ఇది తుగ్లక్‌ పరిపాలన అంటారని, అవిశ్వాసం ఆయుధాన్ని తన చేతిలో పెట్టుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కత్తులు, గొడ్డళ్ళతో చంపేయమని ప్రజలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. ఈ డైలాగులూ, డ్రామాలు ఎందుకు చంద్రబాబూ అని శ్రీమతి షర్మిల నిలదీశారు.

అధికారంలో ఉన్నంతకాలమూ వ్యవసాయం దండగ అని, ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని, సబ్సిడీలు ఇస్తే ప్రజలు సోమరిపోతులవుతారని చంద్రబాబు చెప్పారని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. రూ.50 ఉన్న హార్సుపవర్‌ విద్యుత్‌ను రూ. 625 కు చంద్రబాబు పెంచేశారన్నారు. ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచిన చంద్రబాబు వాటిని కట్టలేమన్న రైతులపై కేసులు పెట్టి, కోర్టుల చుట్టూ తిప్పి, పోలీసు స్టేషన్లకు ఈడ్చుకుపోయారన్నారు. చంద్రబాబు పెట్టిన హింసలు, చేసిన అవమానాలు తట్టుకోలేక 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు.

విద్యార్థులు స్కాలర్‌షిప్పులు అడిగితే వారిని చంద్రబాబు లాఠీలతో కొట్టించారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. స్కాలర్‌షిప్పులు ఇవ్వలేదు సరికదా అసలు మెస్‌ చార్జీలు కూడా పెంచలేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళే పేదల వద్ద కూడా యూజర్‌ చార్జీలు వసూలు చేసిన ఘనుడు చంద్రబాబు అన్నారు. తన ఎనిమిదేళ్ళ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిందని భావిస్తే అదే పాలనను మళ్ళీ తెస్తానని చెప్పే ధైర్యం ఎందుకు చేయడంలేదని శ్రీమతి షర్మిల నిలదీశారు. చెప్పుకోలేనంత ఘోరంగా పరిపాలన చేశారా? అని ప్రశ్నించారు.

గోదావరి, కృష్ణా నదులపై ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటకలలో డ్యామ్‌లు కట్టేసుకుంటున్నారు, అవి పూర్తయితే మన రాష్ట్రానికి చుక్క నీరు రాదని, వాటి నిర్మాణాలను నిలిపివేయించమని, లేకపోతే చరిత్ర హీనుడివి అవుతావని అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మహానేత వైయస్‌ హెచ్చరించినా వినలేదని తూర్పారట్టారు. 50కి పైగా ప్రభుత్వ రంగ సంస్థలను చిన్న చిన్నముక్కలుగా చేసి తన బినామీలకు చంద్రబాబు పప్పుబెల్లాల్లా పంచిపెట్టేశారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులను కూడా ఇచ్చేశారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో లక్షలాది మంది రైతులు పొట్టకూటి కోసం ముంబాయి లాంటి నగరాలకు వెళ్ళిపోయి ఫుట్‌పాత్‌ల పాలయ్యారని దుమ్మెత్తిపోశారు. అంత ఘోరంగా పరిపాలించిన చంద్రబాబు మళ్ళీ వచ్చి తనకు అధికారం ఇవ్వాలని, రాష్ట్రాన్ని ఆరు నెలల్లో గాడిలో పెడతాంటూ చెబుతున్నారని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగేసిందన్న సామెత చంద్రబాబు మాటలు చూస్తే గుర్తుకు వస్తోందన్నారు.

ఇలాంటి చంద్రబాబు కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నారని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. తన మీద ఉన్న అనేక అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం విచారణ చేయకుండా ఉండేందుకే దానితో కుమ్మక్కయ్యారన్నారు. రెండెకరాల చంద్రబాబుకు ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ఏ ఆధారాలూ లేకపోయినా జగనన్నను జైలుపాలు చేశారని ఆమె నిప్పులు చెరిగారు. ఉదయించే సూర్యుడ్ని, జగనన్నను ఎవ్వరూ ఆపలేరన్నారు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారని, రాజన్న రాజ్యాన్ని స్థాపిస్థారని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. రాజన్న ఇచ్చిన ప్రతి మాటను జగనన్న నెరవేరుస్తారని ఆమె హామీ ఇచ్చారు. ప్రతి ఎకరాకు నీళ్ళివ్వాలన్న కల నెరవేరుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు ఉండాలన్న రాజన్న ఆశయాన్ని జగనన్న సాధిస్తారన్నారు.

జనసంద్రంగా మారిన పిడుగురాళ్ల:
జననేత శ్రీ జగన్ సోదరి‌ శ్రీమతి షర్మిల మరో ప్రస్థానం పాదయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల చేరుకున్నారు. గురువారం సాయంత్రం పిడుగురాళ్ళలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ స్థాయిలో జనం తరలివచ్చారు. రహదారులు, వీధులు జనంతో నిండిపోయాయి. ఎటుచూసినా జనమే కనిపించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన జనంతో పిడుగురాళ్ల జనసంద్రాన్ని తలపించింది. జై జగన్ నినాదాలతో‌ పిడుగురాళ్ళ హోరెత్తిపోయింది.
Back to Top