మహిళా లోకానికే గర్వకారణం షర్మిల

వెంకటాపురం (మహబూబ్‌నగర్‌ జిల్లా) 25 నవంబర్‌ 2012: ఒక మహిళ మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం సాహసం అని నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అభివర్ణించారు. ఇలాంటి సందర్భం గురించి దేశ చరిత్రలో మనం వినలేదని, ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఇంతటి సాహసం చేశారేమో తెలుసుకోవాల్సి ఉందన్నారు. అయితే, షర్మిల తన పాదయాత్రను చాలా అవలీలగా, సునాయాసంగా చేస్తున్నారని మేకపాటి హర్షం వ్యక్తం చేశారు. మొన్న కర్నూలు నుంచి తుంగభద్ర వంతెన మీదుగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో షర్మిల తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టిన రోజున తెలంగాణ సోదరులు ఎంత గొప్ప స్వాగతం చెప్పారో మరిచిపోలేమన్నారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారంనాటికి 39వ రోజుకు చేరింది. ఆలంపూరు నియోజకవర్గంలోని వెంకటాపురంలో శనివారం రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి ఆదివారం ఉదయం 4వ రోజు షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. ఉదయం నుంచే భారీగా చేరుకున్న ప్రజలు షర్మిలకు సాదరంగా స్వాగతం పలికారు. మరో వైపు మొహర్రం సందర్భంగా షర్మిలకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలు ముస్లింలు అక్కడికి తరలివచ్చారు. ఆదివారం పాదయాత్రలో పాల్గొన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆయన సోదరుడు, నెల్లూరు జిల్లా ఉదయగిరి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి మీడియాలో తమ స్పందనను వెల్లడించారు.

వైయస్‌ఆర్‌ పాలనలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు పొందిన ప్రతి ఒక్కరూ షర్మిల అడుగులో అడుగు వేస్తున్నారని మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి చెప్పారు. నీచ రాజకీయాలను ప్రజలకు తెలియజేస్తూ సమస్యలు కూడా ఆమె తెలుసుకుంటున్నారని వారు అన్నారు. పాలమూరు జిల్లాలో షర్మిలకు లభించిన ఆదరణ చూస్తే మహానేత వైయస్‌ బిడ్డల పట్ల వారికి ఎంత ప్రేమ ఉందో అవగతం అవుతున్నదన్నారు. 38 రోజుల్లో షర్మిల సునాయాసంగా 500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారని ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. పొలాల్లోకి వెళ్ళి కూలీల సమస్యలు తెలుసుకుంటున్నారన్నారు. పంటలు, రైతుల పరిస్థితిని ఆమె తెలుసుకుంటున్నారన్నారు. షర్మిల మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రకు పూనుకోవడమే పెద్ద సాహసం అని ఆయన అభివర్ణించారు. షర్మిల పాదయాత్ర మహిళా లోకానికే గర్వకారణం అన్నారు.

షర్మిల పాదయాత్రకు రోజు రోజుకూ జనం స్పందన పెద్ద ఎత్తున పెరుగుతోందని చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజలు షర్మిల అడుగులో అడుగు వేసేందుకు వస్తున్నారన్నారు. షర్మిల పాదయాత్రకు వస్తున్న అఖండ జనాదరణను చూసి కాంగ్రెస్‌, టిడిపిలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆయన అన్నారు. అందుకే తమకు వంత పాడే మీడియాలో లేనిపోని కథనాలు అల్లి అభాండాలు వేస్తున్నాయన్నారు. షర్మిల పాదయాత్రకు లభిస్తున్న జనాదరణతో ఆ పార్టీల నాయకుల గుండెల్లో దడ మొదలైందని వ్యాఖ్యానించారు. 
Back to Top