'మహానేత వైయస్‌తో చంద్రబాబుకు పోలికా?'

హైదరాబాద్, 3 జనవరి  2013: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డికి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి పోలికే లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సలహాదారు డి.ఎ. సోమయాజులు వ్యాఖ్యానించారు. అసలు చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్ర రికార్డులో వాస్తవం ఎంత అని సోమయాజులు ప్రశ్నించారు. మండు వేసవిలో 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలో దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్రతో చల్లని వాతావరణంలో, మెల్లమెల్లగా కొనసాగుతున్న చంద్రబాబు యాత్రను ఎలా పోల్చగలం అన్నారు. అంతటి మండుటెండలో కూడా మహానేత వైయస్‌ఆర్‌ రోజుకు 25 కిలోమీటర్లకు తగ్గకుండా నడిచారన్నారు. అదే చంద్రబాబు నాయుడు రోజుకు 13, 15 కిలోమీటర్లు కూడా నడవడంలేదు. నిజానికి చంద్రబాబు నడుస్తున్నారా? లేక ఎవరైనా లాగుతున్నారా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. గురువారం నాటికి చంద్రబాబు 1470 కిలో మీటర్లు నడిచారని, దివంగత మహానేత చేసిన 1468 కిలోమీటర్ల రికార్డును అధిగమించినట్లు చెప్పుకుంటున్నారని, దానిపై మీ కామెంట్‌ ఏమిటన్న ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నకు బదులుగా సోమయాజులు ఇలా స్పందించారు.

క్రికెట్‌లో డాన్‌ బ్రాడ్‌మన్‌ గురించి మీరు వినే ఉంటారని, ఆయన 59 టెస్టు మ్యాచ్‌లలో అత్యధికంగా 29 సెంచరీలు పూర్తిచేసిన వ్యక్తి అని సోమయాజులు గుర్తు చేశారు. ఆయన ఆరు వేల పరుగులు చేశారని, ఇది ప్రపంచ రికార్డు అన్నారు. బ్రాడ్‌మన్ ఇన్నింగ్సు సగటు వంద పరుగులు ఉం‌దన్నారు. తరువాత సునీల్‌ గవాస్కర్‌ ఆ రికార్డును అధిగమించిన విషయం ప్రస్తావించారు. అయితే, ఆ రికార్డు వంద టెస్టుల్లో చేసిందని గుర్తుచేశారు. చంద్రబాబు చేసింది ఎలా రికార్డు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

చంద్రబాబు నాయుడు ప్రతి రోజూ నోటికి హద్దూ పద్దూ లేకుండా మాట్లాడుతున్నారని సోమయాజులు నిప్పులు చెరిగారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోటి సంతకాల కార్యక్రమంపై ఆయన మాట్లాడిన తీరు సహించరానిదన్నారు. తమ పార్టీ సంతకాల సేకరణకు, ఢిల్లీ రేప్‌ కేసు నిందితుల తరఫున సంతకాలు చేస్తే వదిలేస్తారా అని ప్రశ్నించడాన్ని పట్టి చంద్రబాబు మైండ్‌ సెట్‌ ఏ విధంగా ఉందో అర్థం అవుతోందన్నారు. ఎన్నిసార్లు ఓడిపోయినా టిడిపి నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి తెలిసి రాలేదని సోమయాజులు ఎద్దేవా చేశారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి, సిట్టింగ్‌ సభ్యులకు వ్యతిరేక ఓటు ఉంటుందని, అయితే, అప్పటికి అధికారంలో లేకపోయినా 2009 ఎన్నికల్లో టిడిపి ఓడిపోయిన వైనాన్ని ఆయన గుర్తు చేశారు. టిడిపి నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న తీరు వల్లే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని, అనేక చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదని ఎద్దేవా చేశారు. పదవిలో లేని పార్టీకి 14 శాతం ఓట్లు పడిపోవడం ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదన్నారు. అది ఒక్క టిడిపి విషయంలోనే జరిగిందన్నారు.
Back to Top