మభ్యపెట్టేందుకు బాబు 'వస్తున్నా'రు

ఉరవకొండ: రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకే నారా చంద్రబాబు నాయుడు ‘మీకోసం వస్తున్నా’ పేరుతో పాదయాత్ర చేస్తున్నారని వైయస్ఆర్ సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శించారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు తేజోనాథ్, నియోజకవర్గ కమిటీ సభ్యులు అశోక్‌కుమార్ మాట్లాడుతూ 1995లో దొడ్డిదారిన సీఎం అయిన చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.  అప్పుల ఊబిలో కూరుకుపోయి కరెంటు బిల్లులు కట్టలేని రైతుల మోటార్లు, స్టార్టర్లు పీకేయించిన ఘనుడని విమర్శించారు. అప్పుల బాధతో జిల్లాలో 26 మంది రైతులు బలన్మరణాలకు గురైతే పరామర్శించిన పాపాన పోలేదన్నారు. వర్షాలు లేక, బోర్లు ఎండిపోయి రైతులు సతమతమవుతున్న సమయంలో పాదయాత్ర చేసిన మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రూ.12 కోట్ల విద్యుత్తు బకాయిలు రద్దు చేసి, వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు అందించారన్నారు. పాదయాత్రలో గుర్తించిన సమస్యలను పరిష్కరించడమే కాకుండా, హామీలన్నింటినీ నెరవేర్చిన ఘనత వైయస్‌ఆర్‌కే దక్కిందన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగానే కాదు ప్రతిపక్ష నాయకుడిగా పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లుగా వైయస్ పాదయాత్రను కాపీ కొట్టారన్నారు. ముఖ్యమంత్రి పీఠమే ఆయన పాదయాత్ర లక్ష్యమని విమర్శించారు. చంద్రబాబుపై సీబీఐ విచారణకి ఆదేశిస్తామని ప్రకటనలు చేస్తూ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి పరోక్షంగా ఆయనకు ప్రచారం చేస్తున్నారన్నారు. 

Back to Top