ప్ర‌శ్నోత్త‌రాల త‌రువాత అవిశ్వాసం తీర్మానంపై చ‌ర్చ‌

 
న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతోన్న అన్యాయాన్ని నిరసిస్తూ లోక్‌సభలో వైయ‌స్ఆర్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు స్పీకర్‌ టేబుల్‌పైకి చేరాయి. శుక్రవారం ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశం ఉంది. వైయ‌స్ఆర్‌ సీపీ అభ్యర్థన మేరకు ఇప్పటికే పలు రాజకీయ పక్షాలు తీర్మానానికి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. కాగా, హోదా పోరులో కలిసొస్తానన్న టీడీపీ.. శుక్రవారం మాటమార్చి, సొంతగా తీర్మానం పెడతామని ప్రకటించడం గనమనార్హం. నిన్ననే నోటీసు ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి : ప్రత్యేక హోదాపై సానుకూలంగా స్పందించనందుకు నిరసనగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ స్నేహలతా శ్రీవాస్తవకు నోటీసు అందజేశారు. ‘‘లోక్‌సభ కార్యకలాపాల నియమావళిలోని చాప్టర్‌ 17లో గల 198(బి) నిబంధన కింద నేను ఈ తీర్మానాన్ని 2018 మార్చి 16న ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇస్తున్నాను. ఈ తీర్మానాన్ని 2018 మార్చి 16 నాటి సభా కార్యకలాపాల సవరించిన జాబితాలో చేర్చాలని అభ్యర్థిస్తున్నాను. తీర్మానం: ఈ సభ మంత్రి మండలిపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది’’ అని నోటీసులో వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.


Back to Top