ఆ లేఖ సృష్టించిందే!

 

తొలుత దాని విషయం వెల్లడించని అధికారులు  

డీజీపీ ప్రకటన తర్వాత హఠాత్తుగా తెరపైకి..

జేబులో మడిచి పెట్టినా నలగని లేఖ! 

దస్తూరిలో తేడా ఉందంటే తొలుత కొట్టిపారేసిన పోలీసులు

తాజాగా మరో ఇద్దరితో రాయించాడని వెల్లడి  

లేఖపై మాట్లాడలేనన్న చీఫ్‌ సెక్యూరీటీ ఆఫీసర్‌

 విశాఖపట్నం: ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కత్తితో హత్యాయత్నం చేసిన దుండగుడు శ్రీనివాసరావు వద్ద లభించిన లేఖ పోలీసుల సృష్టేనని స్పష్టమవుతోంది. దీనిపై పోలీసులు రోజుకో కథ అల్లుతుండడంతో ఆ లేఖ సృష్టించిందేనన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే..
- డీజీపీ ఠాకూర్‌ గురువారం మధ్యాహ్నం అమరావతిలో మీడియాకు ప్రకటించే వరకు అసలు లేఖ విషయమే ఎవరికీ తెలీదు. 
- అనంతరం లేఖ ఉందని చెబుతూ వచ్చిన పోలీసులు ముందు 8 పేజీలు.. ఆ తర్వాత 10 పేజీలు.. చివరికి 11 పేజీలకు పెంచారు. 
- అలాగే, మొత్తం 11పేజీల లేఖను శ్రీనివాసరావే రాశాడని ముందు ప్రకటించారు. లేఖలో ఉన్న దస్తూరి స్వయంగా అతనిదేనని కూడా స్పష్టంచేశారు. 
- కానీ, లేఖలో మూడు రకాల చేతిరాతలు ఉన్నాయి.
- అలాగే, పదో తరగతి చదువుకున్న అతను రాజకీయ, సామాజిక అంశాలను విశ్లేషిస్తూ రాయడంపై సందేహాలు తలెత్తాయి.
- ప్యాంటు జేబులో పెట్టుకున్న లేఖ ప్రతులు ఏమాత్రం నలగకుండా అప్పటికప్పుడు తాజా ఏ–4 షీట్‌లో రాసినట్లు ఉన్నాయి.

ఆ లేఖ ముగ్గురు రాశారట!


ఇదిలా ఉంటే.. ‘ఆ లేఖపై సందేహాలెన్నో’ శీర్షికన సాక్షిలో కథనం రావడంతో పాటు శుక్రవారం ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పోలీసులు ప్లేటు ఫిరాయించారు. నిందితుడి వద్ద లభించిన లేఖ మొత్తం అతను రాసింది కాదని, అతనితోపాటు మరో ఇద్దరు రాశారని విశాఖ సీపీ లడ్హా శుక్రవారం చెప్పుకొచ్చారు. 11 పేజీల లేఖలో తొమ్మిది పేజీలను నిందితుడు తన సోదరి జె.విజయలక్ష్మితో, 10వ పేజీని తనతోపాటే రెస్టారెంట్‌లో పనిచేస్తున్న రేవతీపతి (19)తో రాయించాడని, చివరి పేజీలో ఉన్న లైన్లను నిందితుడు శ్రీనివాస్‌ స్వయంగా రాసినట్లు లడ్హా వివరించారు. వాస్తవానికి ఆ లేఖ ప్రతులను పరిశీలిస్తే ముగ్గురు రాసినట్టు ఉందని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంవల్లే పోలీసులు మరో ఇద్దరి కొత్త పాత్రలను ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. అలాగే, వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన సమయంలో పార్టీ నేతలు నిందితుడ్ని చుట్టుముట్టిన సందర్భంలో కూడా అతని వద్ద ఎక్కడా లేఖ జాడలేదు. కానీ, ఆ తర్వాత నుంచి లేఖ ఉందంటూ ప్రచారం చేసి రాత్రికి విడుదల చేశారు.

లేఖపై నోరెత్తని ఎయిర్‌పోర్టు అధికారులు


ఏదైనా కేసు విషయమై ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్‌ దళాలు అదుపులో తీసుకున్న నిందితులను పోలీసులకు అప్పగించే సమయంలో పంచనామా చేస్తారు. అతని వద్ద స్వాధీనం చేసుకున్న వాటిలో ఆయుధాలు, వస్తువులు ఏమైనా ఉంటే ఉమ్మడిగా పంచనామా రాసి ఒక కాపీ సీఐఎస్‌ఎఫ్‌ వద్ద ఉంచుకుని మరో కాపీ పోలీసులకు అప్పగిస్తారు. ఈ క్రమంలో మధ్యాహ్నం వరకు లేఖ విషయమై మాట్లాడని సీఐఎస్‌ఎఫ్, ఎయిర్‌పోర్టు అధికారులు రాత్రికి విడుదల చేసిన లేఖలో మాత్రం సంతకాలు చేయడం అనుమానాలకు తావిచ్చింది. పోలీసుల ప్రోద్బలంతో ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీకి చెందిన ఓ అధికారి ఒత్తిడితోనే సీఐఎస్‌ఎఫ్‌ వారు లేఖపై సంతకం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అందుకే ఈ విషయమై మాట్లాడేందుకు శుక్రవారం సీఐఎస్‌ఎఫ్, ఎయిర్‌పోర్టు అధికారులు అంగీకరించలేదు. ‘తొలుత లేఖ విషయం ప్రస్తావించని మీరు.. సాయంత్రానికి లేఖలో ఎలా సంతకం చేశార’ని ఎయిర్‌పోర్ట్‌ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ వేణుగోపాల్‌ను ‘సాక్షి’ ప్రశ్నించగా.. ఆ విషయమై తాను మాట్లాడలేనని బదులిచ్చారు. 


తాజా వీడియోలు

Back to Top