కష్టపడదాం.. పార్టీని అధికారంలోకి తెచ్చుకుందాం..!

– మూడేళ్ల పాలనలో కన్పించని అభివృద్ది
– మన పోరాటం వల్లే కేసీ, బ్రహ్మంసాగర్‌లకు సాగు నీరు
–  కార్యకర్తలకు అండగా ఉంటాం
– రాబోవు రోజుల్లో అధికార పార్టీ ఆగడాలు సాగవు
– నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

మైదుకూరు టౌన్‌/బ్రహ్మంగారిమఠం/చాపాడు: మూడేళ్ల పాటు అధికార పార్టీ ఆగడాలను తట్టుకున్నాం.. మరికొద్దికాలమే వారు అధికారంలో ఉంటారు.. రెండేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడదాం... పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి కార్యకర్తలకు భరోసా కల్పించారు. మైదుకూరు పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డులో గల శ్రీలక్ష్మీవెంకటేశ్వర మంటపంలో శుక్రవారం నియోజకవర్గపు స్థాయి వైయస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. దీనికి అధ్యక్షత వహించిన శాసన సభ్యులు రఘురామిరెడ్డి మాట్లాడుతూ... తప్పుడు హామీలతో పదవిలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ఏ ఒక్కటి కూడా అమలు పరచకపోగా, ఇంకా ప్రజలకు మాయమాటలు చెబుతున్నారన్నారు. ప్రజలు ఇప్పటికే ఆయన మాటలకు విసుగు చెంది ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదన్నారు.

జన్మభూమి కమిటీల ద్వారా నిరు పేదలకు సరైన న్యాయం జరగలేదని, ఇదేమని అధికారులను ప్రశ్నిస్తే మేమే ఉత్సవ విగ్రహాల్లా ఉన్నామని చెప్పటం హాస్యాస్పదమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే మైదుకూరు నియోజకవర్గం అభివృద్దికి మన జిల్లా ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ఎనలేని కృషి చేస్తారన్నారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గుర్తించుకునే విధంగా మన పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు రెండేళ్ల పాటు కష్టపడితే మన పార్టీనీ అధికారంలోకి తెచ్చుకుంటామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది: వైయస్సార్‌సీపీ జిల్లా రైతు విభాగం కన్వీనర్‌ సంబటూరు ప్రసాద్‌రెడ్డి
వైయస్సార్‌సీపీ రైతు సమస్యల పట్ల గత మూడేళ్లుగా జిల్లా వ్యాప్తంగా పోరాటాలు కొనసాగిస్తున్నాము. ఇందులో ప్రధానంగా రైతుకు సాగునీరు, పంటల గిట్టుబాటు ధరలు, ఎరువులు, విత్తనాల పంపిణీలపైన పోరాడుతున్నాము. మైదుకూరు నియోజకవర్గంలో రైతులతో పోరాటం చేయటంతో ప్రభుత్వం దిగివచ్చి గతేడాది కేసీ కాలువ, బ్రహ్మంసాగర్‌లకు సాగునీరు వచ్చింది.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ఒక సామాజిక వర్గంగా అధికారులు వ్యవహరిస్తున్నారుః రాష్ట్ర కార్యదర్శి ఈవీ మహేశ్వర్‌రెడ్డి
అధికారులు ఒక  సామాజిక వర్గానికి వత్తాసు పలుకుతున్నారు.  విధానం సరైన పద్దతి కాదు. ఇప్పటికే వైయస్సార్‌సీపీ కార్యకర్తలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రభుత్వం ఇక ఏడాదిలోనే ముగుస్తుంది. వచ్చేది వైయస్సార్‌సీపీ ప్రభుత్వం. అధికారుల తీరు మారకపోతే మీరు నేర్పిన విధానాన్నే మేము అమలు పరచాల్సి వస్తుంది. జగన్‌ సీఎం కావటం తథ్యం.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
కార్యకర్తలకు నాయకులు అండగా ఉండాలిః జెడ్పీటీసీ బాలనరసింహారెడ్డి
మూడేళ్లు అధికార పార్టీ నాయకుల తీరు వలన పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. కార్యకర్తలకు నాయకులు అండగా ఉంటే అధికార పార్టీ నాయకుల ఆగడాలను అరికట్టవచ్చు. మా మండలంలో చిన్న సమస్యలో అనామకుడిని పోలీసులు చిత్ర హింసలు చేశారన్నారు. దీనిని నాయకులు అండగా నిలబడాలి. రెండేళ్లలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి యస్సార్‌సీపీ అధికారంలోకి తెచ్చుకోవాలని, తిరిగి రఘురామిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుని మంత్రిని చేసుకోవాలి.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
మైదుకూరు పట్టణ అధ్యక్షులు ధనపాల రవీంద్ర
 ప్రతి కార్యకర్త ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేసి పార్టీ అభివృ ద్దికి కృషి చేయాలి.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top