రోజా సస్పెన్షన్ పై న్యాయపోరాటం చేస్తాం

  • అంకెల గారడీతో బాబు మరోసారి మోసం చేశారు
  • రాయలసీమ ప్రాజెక్ట్ లపై పక్షపాతం చూపిస్తున్నారు
  • రోజాపై ప్రభుత్వానికి ఎందుకంత వ్యక్తిగత కక్ష
  • వైయస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజం
ఒంగోలుః అంకెల గారడీతో చంద్రబాబు మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి  మండిపడ్డారు.  కేంద్ర జీడీపీ కంటే రాష్ట్ర జీడీపీ ఎక్కువగా ఉందని చెప్పే విధంగా బాబు అంకెల గారడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. 2018 నాటికి వెలిగొండ ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి... ఆ ప్రాజెక్ట్‌ పూర్తి అయ్యేందుకు రూ.2800 కోట్లు అవసరం ఉంటే... బడ్జెట్‌లో మాత్రం రూ.200 కోట్లే కేటాయించారన్నారు. ప్రాజెక్ట్ ల విషయంలో గానీ రైతు,  డ్రాక్రారుణ మాఫీ విషయంలో గానీ ప్రతీ విషయంలో బాబు మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వైఫల్యం వల్ల ఒక్క ప్రకాశం జిల్లాలోనే 420మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.  వెలిగొండ ప్రాజెక్ట్  పూర్తి చేసుంటే  కిడ్నీ వ్యాధితో ఇంతమందితో చనిపోయేవాళ్లు కాదని,  ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేవాళ్లు కాదని పేర్కొన్నారు. 

రాయలసీమ ప్రకాశం, నెల్లూరుల జిల్లాలకు  ముఖ్యమైన హంద్రీనీవా, గాలేరు -నగరి, పోతిరెడ్డి పాడు, వెలిగొండ ప్రాజెక్ట్ లపై  ప్రభుత్వం పక్షపాతం చూపిస్తోందని వైవీ మండిపడ్డారు.  ప్రభుత్వ అలసత్వం కారణంగా సాగునీరు కాదు కదా కనీసం తాగునీరు కూడ దొరకని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఎక్కడ కూడ ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోవడం లేదని, తాత్కాలిక చర్యల పేరుతో కోట్లాది రూపాయలు దోచేస్తున్నారని చంద్రబాబుపై వైవీ ధ్వజమెత్తారు. బడ్జెట్‌ సాక్షిగా చంద్రబాబు ప్రత్యేక హోదాను సమాధి చేశారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. 

ఎమ్మెల్యే రోజాపై చంద్రబాబుకు ఎందుకంత వ్యక్తగత కక్ష అని వైవీ సూటిగా ప్రశ్నించారు. రోజాను ఇప్పటికే ఏడాదిపాటు అసెంబ్లీకి దూరం చేసిన ప్రభుత్వం మరోసారి కుట్రకు తెర లేపుతోందని ఆరోపించారు.  రోజా సస్పెన్షన్‌పై న్యాయపోరాటం చేస్తామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కాగా ఎమ్మెల్యే రోజాను మరో ఏడాది పాటు ఏపీ శాసనసభ నుంచి సస్పెండ్‌ చేయాలని శాసనసభ ప్రివిలేజ్‌ కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌పై అసెంబ్లీలో రోజా  ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసినపుడు.. సమాధానం చెప్పలేక ఆమెను నిబంధనలకు విరుద్ధంగా  2015, డిసెంబర్‌ 18న శాసనసభ నుంచి ప్రివిలేజ్‌ కమిటీకి పంపకుండానే నేరుగా సస్పెండ్‌ చేశారు.
Back to Top