హైదరాబాద్, 19 అక్టోబర్, 2012 : పాదయాత్రలో అమలుకు సాధ్యం కాని హమీలను గుప్పిస్తూ చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ విమర్శించారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేయని పనులన్నీ ఇప్పుడు చేస్తానంటూ బాబు చెబుతున్నారనీ, అందుకే ప్రజలు వాటిని నమ్మరనీ ఆయన అన్నారు. రెండు రూపాయల కిలోబియ్యం పథకాన్నే ఆయన అమలు చేయలేకపోయారని రామకృష్ణ గుర్తు చేశారు.
అధికారంలోకి వస్తే రైతురుణాల మాఫీపై తొలి సంతకం చేస్తానంటూ చంద్రబాబు చేస్తున్న వాగ్దానం అమలుకు ఎలా సాధ్యమో చెప్పాలని ఆయన శుక్రవారంనాడిక్కడ మీడియా సమావేశంలో నిలదీశారు. "రైతురుణాలు రూ.50 వేల కోట్లదాకా ఉన్నాయి. టర్ము లోన్లు కూడా కలుపుకుంటే అవి సుమారు లక్ష కోట్ల రూపాయలదాకా ఉంటాయి. వీటి మాఫీ కావలసిన నిధులను రాష్ట్ర బడ్జెట్ నుండి ఇస్తారా? కేంద్రం ద్వారా మాఫీ చేయిస్తారా? అసలు మీరు పార్లమెంటుకు వెళ్లి ప్రధానమంత్రి పదవికి పోటీ పడతారా? రైతురుణాల మాఫీకి కటాఫ్ డేట్ ఎప్పటికి పెడతారు? వడ్డీలు కూడా మాఫీ చేస్తారా?" అని రామకృష్ణ ప్రశ్నలవర్షం కురిపించారు. అసలు మన రాష్ట్ర బడ్జెట్టే సుమారు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలనీ, ఆదాయం రూ. 75 వేల కోట్లదాకా ఉంటుందనీ, ఇది మరింత పెరుగుతుందనుకున్నా లక్షకోట్ల రుణాలను ఏ రకంగా మాఫీ చేయాలనుకుంటున్నారో వివరణ ఇవ్వాలని ఆయన చంద్రబాబును కోరారు.
ఇలాంటి హామీలు ఇచ్చేప్పుడు అవెంతవరకు సాధ్యమో కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుందని రామకృష్ణ అన్నారు. ఆనాడు వైయస్ ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పి, ఆ ఫైలుపైనే తొలి సంతకం చేశారని ఆయన గుర్తు చేశారు. రైతురుణాల మాఫీకి కేంద్రాన్ని ఒప్పించి 12 వేల కోట్ల రూపాయల మేరకు రైతులకు లబ్ధి జరిగేలా చూశారనీ ఆయన గుర్తు చేశారు. వైయస్ ఎప్పుడైనా రాష్ట్ర బడ్జెట్ ద్వారా చేయగలిగిన పనులకు సంబంధించిన వాగ్దానాలే చేశారని ఆయన చెప్పారు. వైయస్ వృద్ధాప్య పింఛన్ల మొత్తాన్ని రూ.200లకు కుదించారన్నఆరోపణలు అవాస్తవాలని ఆయన తోసిపుచ్చారు. నిజానికి నాడు చంద్రబాబు హయాంలో ఉండిన రూ. 75 పింఛనును వైయస్ రెండు వందల రూపాయలకు పెంచారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు ప్రజలను ఆశపెట్టి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.
తెలుగుదేశంపార్టీనే టార్గెట్ చేస్తున్నారన్నవిమర్శలను తిప్పికొడుతూ, ఈ రాష్ట్రంలో అధికారపక్షమూ, ప్రధాన ప్రతిపక్షమూ ఒక్కటై, ఒక్కటిగానే పని చేస్తున్నాయని రామకృష్ణ వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలతో కేసు వేసినప్పుడు ఆ కసరత్తు అంతా టిడిపి ఆఫీసులోనే జరిగిందని, మొన్నటికి మొన్న చిదంబరంను టిడిపి ఎంపీలు కలిసి ఫిర్యాదు చేయగానే 24 గంటలలోనే ఈడీ ఆదేశాలు వెలువడ్డాయనీ ఆయన ఆరోపించారు. చూడబోతే ఎన్డీఏలోనే కాదు, చంద్రబాబు యుపిఏలోనూ చక్రం తిప్పుతున్నట్లుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు.
"చంద్రబాబు చెబుతున్నారు, తాను ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రధాని పదవిని తిరస్కరించి ముఖ్యమంత్రిగానే కొనసాగానని. ఇదెంతవరకు నిజమో మాకైతే తెలియదు గాని, మరి వాజపేయిగారు, దేవగౌడగారు చెప్పాలి. చంద్రబాబుగారు వద్దంటేనే పదవి తీసుకున్నాం తప్పితే మా అంతట మేం తీసుకోలేదని- వాళ్లు చెప్పాలి." అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
వాళ్ల గుండెల్లో రైళ్లు
షర్మిల మరో ప్రజాప్రస్థానానికి రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగనంత ప్రజాస్పందన వచ్చిందనీ, ప్రభుత్వ వైఫల్యాలే ఈ జననీరాజనానికి కారణమనీ రామకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీరు వల్ల అన్ని వర్గాలూ బాధపడుతున్నాయనడానికి షర్మిలకు లభించిన జనస్పందనే రుజువని ఆయన అన్నారు. షర్మిల పాదయాత్రకు లభించిన అనూహ్య స్పందన చూసి అధికార, ప్రధానప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆయన యెద్దేవా చేశారు. షర్మిల పాదయాత్రను విజయంవంతం చేస్తున్న ప్రజలకు ఆయన పార్టీ తరఫున అభినందనలు తెలిపారు. జగన్‌ను జైలులో ఉంచి వైయస్ఆర్‌సీపీ భవిష్యత్తు లేదంటూ సాగుతున్న అధికారపక్ష, ప్రతిపక్ష ప్రచారాన్ని ప్రజలు ఇలా తిప్పికొట్టారని ఆయన అన్నారు. జగన్ దాకా అక్కర్లేదు, వీళ్లని ఎదుర్కోవడానికి షర్మిలమ్మే చాలునని ప్రజలనుకుంటున్నారని రామకృష్ణ వ్యాఖ్యానించారు. షర్మిలతో పాదయాత్ర చేయించడం ద్వారా జగన్ తన నాయకత్వలక్షణాలను మరోసారి నిరూపించుకున్నారన్నారు. జగన్ ఆలోచనల మేరకు, వైయస్ ఆశయాల పరిపూర్తికై జనం మధ్యలో ఉండి పోరాడతామని ఆయన చెప్పారు.
వైయస్ కుటుంబం పట్ల అభిమానంతో వచ్చేవారందరికీ వైయస్ఆర్ సీపీ స్వాగతం పలుకుతుందని రామకృష్ణ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గెలుపు అవకాశాలున్నప్పుడు సహజంగానే వలసలు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు.