చంద్రబాబు పాలనలో చెత్త ‘కుప్ప' 0

చిత్తూరు: నమ్మిన ప్రజలను నట్టేట ముంచడంలో చంద్రబాబు దిట్ట అనే మాట సామెతలా మారిపోయిందంటే బాబు వెన్నుపోటు ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకు నిదర్శనమే కుప్పం నియోజకవర్గ ప్రజల దీనస్థితి. సెల్‌ఫోన్‌ కనిపెట్టిన నాయుడు, కంప్యూటర్‌ను తయారు చేశానని చెప్పుకునే కోతల రాయుడు వరుసగా ఆరు సార్లు గెలిపిస్తూనే వస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని మహా ఘనంగా అభివృద్ధి చేశారు. దేశంలోనే నా అంత అనుభవజ్ఞుడైన నాయకుడు లేడని చంద్రబాబే చెప్పుకుంటాడు. ఇంతటి ఘనుడు పుట్టిన ఊరు నారావారిపల్లి ఉన్న చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఇతని బాగోతం తెలిసి తిరస్కరించి పంపిస్తే కుప్పం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి నమ్మించడం.. నమ్మించిన ప్రజలను మోసం చేయడంలో పచ్చచొక్కాల పెద్దన్న దిట్ట అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ కుప్పం నియోజకవర్గ ప్రజలకు మాత్రం అర్థం కావడం లేదేమో.. ఇంకా బాబు ఉచ్చులో చిక్కుకొని దశాబ్దాల కాలంగా మోసపోతూనే ఉన్నారు. 

కుప్పంలో సమస్యలు కుప్పలు, కుప్పలుగా తిష్టవేశాయి. సీఎంగా ఉన్న చంద్రబాబు రాష్ట్రం సంగతి దేవుడెరుగు.. ఆయన్ను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలను నిలువునా ముంచుతూనే ఉన్నారు. పాడుబడిన ఇళ్లు, నీరు రాని కుళాయిలు, నిత్యం బురదతో ఉండే రోడ్లు, తలుపులు లేని మరుగుదొడ్లు ఇవే దర్శనమిస్తున్నాయి. రామకుప్పం గడ్డూరు పంచాయతీ పరిధిలోని యానాదికాలనీ ప్రజల అవస్థలు అంతా ఇంతా కాదు. ఎప్పుడు కూలిపడతాయో తెలియని ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ బతుకుతూ.. స్థానిక ప్రజలు కాలం వెల్లదీస్తున్నారు. 

ఎప్పుడో 1970లో మ్రరి చెన్నారెడ్డి సీఎంగా ఉన్న సమయంలో యానాదికాలనీలో 13 ఇళ్లు కట్టించారు. వాటిల్లో 26 కుటుంబాలు జీవించేవి. అవి కనీస మరమ్మతులకు నోచుకోక శిథిలావస్థకు చేరాయి. పెచ్చులూడిన పైకప్పులు, పగుళ్లు వ్యాపించిన గోడలు.. ఇలా ఒంట్లో ఉన్న సమస్యల కంటే ఇంటి సమస్యలే ఎక్కవగా కనిపిస్తున్నాయి. కూలిపోయే స్థితిలో ఉన్న భవనాలను బాగు చేయాలని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇదీ స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ దయనీయ స్థితి. 

యానాది కాలనీలో జనాభా పెరగడంతో 2004లో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉన్న 13కు తోడు మరో 14 ఇళ్లు మంజూరు చేసి నిర్మించి ఇచ్చారు. ఇప్పుడు కాలనీలో జనాభా 300లకు పైమాటే. ఎప్పుడో మంజూరైన 5 ఇళ్లులు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. శిథిలావస్థకు చేరిన ఇళ్లలోనే బతుకులు వెళ్లదీస్తున్నారు. కొండ ప్రాంతాలను ఆనుకొని ఉన్న యానాదికాలనీ వాసులు అటవీ ఉత్పత్తులను అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి బయటి ప్రపంచంతో సంబంధమే లేదు. అసలు తెలియదు. ఇటీవల కాలంలో చంద్రబాబు పార్టీ చొక్కాలు వేసుకొని కొందరు వచ్చి ఫొటోలు, వేలిముద్రలు తీసుకొని పోయారని, అయినా ఇప్పటికీ వరకు ఎవరూ రాలేదు. ఆదుకోలేదని యానాది ప్రజలు వాపోతున్నారు. 
ఇన్నాళ్లూ అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం రెవెన్యూ పరిధిలోకి వచ్చింది.. అయినా ఏమైనా మార్పు ఉందా అంటే.. దానికి గురించి మాట్లాడొద్దంటున్నారు కాలనీవాసులు. ఎన్నోసార్లు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి సమస్యలు తీసుకెళ్లినా కనీసం కాంపౌండ్‌వాల్‌ వరకు కూడా రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వస్తే ఇళ్లన్నీ చెరువులవుతాయని, ఎండాకాలం వస్తే నీటి కోసం చెరువుల కోసం వెతకాల్సిన దుస్థితి నెలకొందని కన్నీరు పెట్టుకుంటున్నారు. మ్రరి చెన్నారెడ్డి, మహానేత వైయస్‌ఆర్‌ కట్టించిన ఇళ్లలో ఉంటున్నామని, ఒక్కో ఇంట్లో ఐదుగురం సభ్యులుంటున్నామని చెబుతున్నారు. ఇవాళో.. రేపో కూలిపోయే ఇళ్లలో బతుకుతున్నామని, తమను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇది నమూనా మాత్రమే.. కుప్పం గడప తొక్కితే కుప్పలు తెప్పలుగా సమస్యలు కనిపిస్తాయి. ప్రజల గోడు వినిపిస్తాయి. నిర్లక్ష్యానికి గురైంది యానాదులే కాదు బాబు పట్టించుకోని అన్ని వర్గాల ప్రజలు అనాథలే అక్కడ. 


Back to Top