కృష్ణా జలాలతో వైయస్ విగ్రహానికి అభిషేకం

కదిరి (అనంతపురం జిల్లా): పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్దనున్న దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కృష్టా జలాలతో అభిషేకం చేశారు. హంద్రీ నీవా కాలువ ద్వారా జీడిపల్లి రిజర్వాయర్ కు చేరిన కృష్టా జలాలతో అభిషేకం చేసి మహానేత మీద ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు.

     ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. రాష్ర్టంలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటుకు వైయస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. ప్రతిపక్ష నేతగా వైయస్ రాజశేఖరరెడ్డి చేసిన పోరాటాలను గుర్తుచేసుకున్నారు. 2004లో ముఖ్యమంత్రి అయ్యాక జలయజ్ఞం పథకాన్ని ప్రవేశ పెట్టి రాష్ర్ట వ్యాప్తంగా లక్షల ఎకరాలకు సాగు నీరందించారని అన్నారు. అందులో భాగంగా హంద్రీ నీవా పథకాన్ని ప్రారంభించి అనంతపురం జిల్లాలను సస్యశ్యామలం చేశారని నేతలు కొనియాడారు. హంద్రీ నీవా కాలువకు అసలు నీరే రాదని విమర్శించిన నేతలు ఇపుడు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. జీడిపల్లి రిజర్వాయర్ కు కృష్టా జలాలు చేరడం వారికి చెంప పెట్టని అన్నారు.

    అనంతపురం జిల్లాలోని కదిరి, పుట్టపర్తి, రాప్తాడు నియోజకవర్గాలకు కృష్ణా జలాలు తరలించే రెండో విడత పనులు కూడా వేగవంతం చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్ఎండీ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో జరిగిన  అభిషేకం కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top