ఊరుమారినా తీరు మారని ప్రభుత్వం

  • ప్రతిపక్షాన్ని శత్రుదేశంగా చూస్తున్న చంద్రబాబు
  • ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించని ప్రభుత్వం
  • వైయస్‌ జగన్‌ ప్రజల తరుపున మాట్లాడితే మైక్‌ కట్‌
  • మీరు ప్రతిపక్షం గొంతు నొక్కితే... ప్రజలు మీ గొంతు శాశ్వతంగా నొక్కుతారు
  • ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి 
విజయవాడ: నూతన అసెంబ్లీ భవనంలోనైనా ప్రజా గుండె చప్పుళ్లకు ప్రతిరూపంగా సమావేశాలు జరుగుతాయనుకుంటే ఊరు మారినా మా తీరు మాదరనే రీతిలో చంద్రబాబు సర్కార్‌ వ్యవహరించిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మండిపడ్డారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో  తాము స్నేహహస్తం అందిస్తే ప్రభుత్వం ప్రతిపక్షాన్ని శుత్రుదేశంగా చూస్తుందని కోటంరెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా అనంతరం మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... ప్రజా సమస్యలు సభలో చర్చకు వస్తాయని, ప్రజల సమస్యలు తొలగిపోతాయని అందరం కోటి ఆశలతో ఎదురు చూశాం.. కానీ ఎప్పటి లాగే ప్రతిపక్షం గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ప్రయత్నం చేసిందని దుయ్యబట్టారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ గత సభా సాంప్రదాయాలకు భిన్నంగా ప్రతిపక్షాన్ని శత్రుదేశంగా చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మందబలం, అధికారం చేతిలో ఉందని చంద్రబాబు నియంతృత్వంగా ప్రజల, ప్రతిపక్షం గొంతు నొక్కిందన్నారు. 

మైక్‌ కోసం నిరసన తెలపాల్సిన దుస్థితి
ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌కు అవకాశం ఇవ్వకుండా కుట్రపూరితంగా వ్యవహరించారని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మండిపడ్డారు. అగ్రిగోల్డ్‌ సమస్యలపై మాట్లాడేందుకు రెండు నిమిషాల సమయం ఇవ్వకుండా మైక్‌ కట్‌. రైతుల సమస్యలపై మాట్లాడుతుండగా 30 సెకన్లలోనే మైక్‌ కట్‌.  శాసనసభ సమావేశాలు మైక్‌ కట్‌లతోనే జరిగాయని ఎద్దేవా చేశారు. రైతులు, విద్యార్థులు, ముస్లిం, మైనార్టీ, దళితులు, ఆరోగ్యశ్రీ, అంగన్‌వాడీ ఏ సమస్యపైనైనా ప్రతిపక్షానికి 2 నిమిషాలు  కూడా మైక్ ఇవ్వడం లేదన్నారు.  ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు స్పీకర్‌ పోడియం దగ్గరకు వెళ్లి అధ్యక్షా మైక్‌ ఇవ్వండి అని నిరసన తెలిపి అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
 
డొల్లతనం బయటపడుతుందనే కుట్ర
ప్రజా సమస్యలపై ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ సభలో ప్రస్తావిస్తే ప్రభుత్వ డొల్లతనం భయపడుతుందని ఉద్దేశ్యపూర్వకంగానే గొంతునొక్కారని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్‌ సమస్యలపై ప్రతిపక్షనేత మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులకు అనవసరంగా మైక్‌ ఇచ్చి వైయస్‌ జగన్‌ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలకు సభలో తావివ్వకుండా సమయాన్ని మొత్తం టీడీపీ సభ్యులు వృధా చేశారని దుయ్యబట్టారు.  మొగల్తూరు ఆక్వాఫుడ్‌ మృతులపై ప్రతిపక్షనేత మాట్లాడుతుండగా గంటలు గంటలు వాయిదాలు వేసుకొని ప్రభుత్వం పారిపోయిందన్నారు. ఆక్వా మృతులపై, పేపర్‌ లీక్‌లపై, అగ్రిగోల్డ్‌ చర్చలకు ఎందుకు వెనకాడిందని ప్రశ్నించారు.మందబలం చేతిలో ఉందని ప్రతిపక్షం గొంతు నొక్కే దుర్మార్గపు, నియంతృత్వ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎప్పటికప్పుడు ప్రతిపక్షం గొంతు నొక్కి వెళ్లితే చెప్పాల్సిన రోజు.. చెప్పాల్సిన చోట, నొక్కాల్సిన రోజు...నొక్కాల్సిన చోట ప్రజలు తెలుగుదేశం పార్టీని రాజకీయంగా శాశ్వతంగా నొక్కేస్తారని హెచ్చరించారు. 
Back to Top