‌కిరణ్‌ సర్కార్ వికృత చర్యలు: గట్టు రామచంద్రరావు

హైదరాబాద్, 23 సెప్టెంబర్‌ 2012: ప్రజా సమస్యలు పరిష్కరించడం చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై భారం మోపేందుకు ఆరాటపడుతోందని వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ మండిపడింది. ధరల పెంపుపైన గాని, ఒక్క ప్రజా సమస్యపైన గాని శాసనసభలో చర్చించలేదని దుయ్యబట్టింది. పైపెచ్చు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన 24 గంటల్లోనే ప్రజల నడ్డి విరిచేందుకు సిద్ధమైపోయిందని నిప్పులు చెరిగింది. శాసనసభను కూడా అపహాస్యం చేస్తూ ప్రజలపై వేల కోట్ల భారం మోపుతోందని ధ్వజమెత్తింది. పెంచిన విత్తనం ధరలు, విద్యుత్, ఆర్టీసీ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఆదివారంనాడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రజల ఆర్థికాభివృద్ధి, జీవన విధానాలు పెంపొందించకుండా వారిపై ఇబ్బడిముబ్బడిగా భారం మోపడం ఎంతవరకు సమంజసమని గట్టు ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ సరిగా నిలదీయకపోవడంవల్లే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం వికృత చేష్టలకు పాల్పడుతూ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, ప్రజలపై భారం మోపుతూ, తీవ్ర ఇబ్బందుల పాలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు మార్గంలోనే ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా నడుస్తున్నారని విమర్శించారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఐదు సంవత్సరాల మూడు నెలల పాటు ప్రజలపై ఒక్క రూపాయి భారం కూడా మోపకుండా సువర్ణయుగం అందిస్తే, ఆయన రెక్కల కష్టంపై వచ్చిన ప్రభుత్వాన్ని నడుపుతున్న ఇప్పటి పాలకులు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల పాటు ఒక్క రూపాయి పన్ను పెంచనని ప్రజలకు వైయస్ ఇచ్చిన హామీకి, ఆయన రాజకీయ వారసులమని చెప్పుకునే వారు తూట్లు పొడుస్తున్నారని ‌ఆవేదన వ్యక్తం చేశారు. 

‘విద్యుత్ చార్జీలు చెల్లించని రైతులను జైల్లో పెట్టించాలంటూ ప్రత్యేక జీవోలు విడుదల చేయడంతో పాటు పోలీసు కాల్పులు జరిపించిన ఘనుడు చంద్రబాబు. తొమ్మిదేళ్ల పాటు ప్రజలను పీల్చి పిప్పిచేసి నరకం చూపించారు. అలాంటి వ్యక్తి దయాదాక్షిణ్యాలతో నడుస్తున్న కిరణ్ ప్రభుత్వం ఆ‌యన ఆలోచనలనే కొనసాగిస్తోంది. అందుకే నిరంతరం ప్రజలను దగా చేయడమే పనిగా పెట్టుకుంది’ అని గట్టు దుయ్యబట్టారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నది చంద్రబాబేనని‌ ఆయన ఆరోపించారు. డబ్బులు చెట్లకు కాయవు అంటున్న ప్రధాని మన్మోహన్‌ ప్రజలకు అవి ఏ చెట్ల నుంచి వస్తాయో చెప్పాలని గట్టు సూటిగా ప్రశ్నించారు.
Back to Top