కార్మికులను పట్టించుకోని ప్రభుత్వం

కొత్తూరు (మహబూబ్ నగర్ జిల్లా):

కార్మికులు, కర్షకుల శ్రేయస్సును కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఆరోపించారు. ప్రభుత్వ విధానాల వల్ల లక్షలాది మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారని అన్నారు. ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడిందన్నారు. అందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థదే కారణమని ధ్వజమెత్తారు.

     'మరో ప్రజా  ప్రస్థానం' పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల పాలమూరు జిల్లా కొత్తూరు మండలంలో పర్యటించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొత్తూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.  కొత్తూరు మండలంలో  పరిశ్రమలు ఎక్కువగా ఉండడం వల్ల ఎంతోమంది కార్మికులు ఉపాధి పొందుతున్నారన్నారు. విద్యుత్‌ కోతల కారణంగా ఉపాధి కరవై వేలాది మంది కార్మికులు రోడ్డున పడుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

     పాలమూరు జిల్లాలో అనధికార విద్యుత్ కోతల కారణంగా ఇప్పటికే పలు కంపెనీలు మూతపడ్డాయని శ్రీమతి షర్మిల అన్నారు. అయినా జిల్లా నుంచి గెలుపొందిన నేతలు పట్టించుకోవడం లేదన్నారు.  ఇంతటి విద్యుత్ సంక్షోభం తలెత్తినా పార్లమెంట్ సభ్యుడు కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు. వచ్చే ఎన్నికల్లో నేతలకు తగిన గుణపాఠం చెప్పాలని శ్రీమతి షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Back to Top