జన కొండగా మారిన బెల్లంకొండ

పెదకూరపాడు:

బెల్లంకొండ నిన్నమొన్నటి వరకు పెదకూరపాడు నియోజకవర్గంలో ఒక సాధారణ గ్రామం. శుక్రవారం ఆ గ్రామం జనసాగరమైంది. మహానేత రాజన్న ముద్దుబిడ్డ షర్మిలకు ఆ గ్రామంలో బ్రహ్మరథం పట్టారు. ఆ గ్రామంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు బెల్లంకొండను జనకొండగా మార్చేశారు. మునుపెన్నడూ ఏ రాజకీయ పార్టీనేతకు దక్కని అరుదైన గౌరవాన్ని ఇచ్చి షర్మిలకు ఆత్మీయ స్వాగతం పలికారు. మాచర్ల రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్లంకొండను చేరుకోవడానికి నలు దిక్కుల నుంచి ప్రజలు తరలి రావడంతో రెండు గంటలకుపైగానే సమయం పట్టింది. వ్యవసాయ ఆధారమైన పెదకూరపాడు నియోజకవర్గంలో రైతులు సాగునీరు విద్యుత్ సరఫరాలేక పడుతున్న ఇబ్బందులపై షర్మిల ప్రసంగించారు.

    టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపై ప్రసంగించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ముందు చూపులేకపోవడంతో విద్యుత్ కొరత ఏర్పడిందని వివరించారు. ఈ నియోజకవర్గం పరిధిలోని అచ్చంపేట మండలం కృష్ణానదిపై ప్రాజెక్టు నిర్మిస్తే రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని భావించిన మహానేత చేపట్టిన పులిచింతలను పూర్తిచేయడంలో ప్రభుత్వం అలక్ష్యం వహిస్తుందన్నారు. పులిచింతల నిర్వాసితులకు జగనన్న రాజ్యంలో న్యాయం జరుగుతుందని, బాధితులకు నష్టపరిహారంతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేం దుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

      ఈ ప్రభుత్వంలో రోజుకు మూడు గంటలే విద్యుత్తు సరఫరా ఉండటం వల్ల రైతులకు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందక మిర్చి పంటలు ఎండిపోతున్నాయని వివరించారు. కృష్ణా నదిపై కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మిస్తున్నా, అప్పటి సీఎం వీటిని నియంత్రించక పోవడం వల్లనే సాగునీటి కొరత ఏర్పడిందన్నారు. రైతులు పడుతున్న సాగునీటి ఇబ్బందులకు చంద్రబాబే కారణమని పేర్కొన్నారు. అంతకు ముందు సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం అనుపాలెంలో షర్మిల రచ్చబండ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

టీడీపీ నుంచి వలసలు
షర్మిల సమక్షంలో టీడీపీ నేతలు, వారి అనుచరులు అధిక సంఖ్యలో వైయస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించడంతో కాంగ్రెస్, టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీంతో దాదాపు నాలుగు వేల మంది వైయస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. జిల్లా పార్టీ కన్వీనరు మర్రి రాజశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్టారెడ్డి, మేకతోటి సుచరిత, గుంటూరు, కృష్ణాజిల్లాల కో ఆర్డినేటర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్‌కె), జిల్లా పరిశీలకుడు పూనూరి గౌతంరెడ్డి, కేంద్ర పాలకమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి, ఎస్‌సీ సెల్ కన్వీనరు బండారు సాయిబాబు, బీసీసెల్ కన్వీనరు దేవెళ్ల రేవతి, ఎస్‌టీ సెల్ కన్వీనరు హనుమంతనాయక్, గుంటూరు సిటీ కన్వీనరు లేళ్ల అప్పిరెడ్డి, యువజన విభాగం జిల్లా కన్వీనరు కావటి మనోహరనాయుడు, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర మానవ వనరులు అభివృద్ధి కమిటీ సభ్యురాలు ఆరిమండ విజయశారదారెడ్డి, పార్టీ నాయకులు ఆల్తాఫ్, ముస్తఫా, కూచినపూడి జయలక్ష్మి, ఉయ్యూరు వెంకటరెడ్డి, చిట్టా విజయభాస్కరరెడ్డి, ఆరిమండ వరప్రసాదరెడ్డి, డాక్టర్ గజ్జల నాగభూషణరెడ్డి, నూతలపాటి హనుమయ్య, గుత్తికొండ అంజిరెడ్డి, కంచేటిసాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

Back to Top