జగన్ వస్తాడు, ధైర్యంగా ఉండండి!

హైదరాబాద్‌, 21 అక్టోబర్ 2012 : "జగన్ త్వరలోనే మీ ముందుకు వస్తానని చెప్పమన్నాడు. అందరూ ధైర్యంగా ఉండమని తన మాటగా చెప్పమన్నాడు. మళ్లీ రాజశేఖర్ రెడ్డి సువర్ణ యుగం వస్తుంది" అని విజయమ్మ భరోసా ఇచ్చారు. శనివారం రాత్రి పులివెందుల బహిరంగ సభలో మాట్లాడుతూ ఆమె ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.  జగన్ ఫీజుల గురించి, రైతుల గురించి అనేక దీక్షలు, ఆందోళనలు చేసినా ఈ ప్రభుత్వం స్పందించలేదని ఆమె విమర్శించారు. కేసులు పెట్టిన తరువాత 10 నెలలు కూడా తను ప్రజల మధ్యే ఉన్నాడనీ, కుటుంబం వైపు కూడా చూడలేదనీ ఆమె జగన్ పోరును గుర్తు చేశారు. సరిగ్గా ఉప ఎన్నికల ముందు విచారణ పేరుతో అరెస్టు చేసి జగన్ బాబును జైల్లో పెట్టారనీ, ఇప్పటికి 147 రోజులైందనీ, కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై కథ నడిపిస్తున్నాయనీ ఆమె దుయ్యబట్టారు. ఈ కుమ్మక్కు రాజకీయాలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని ఆమె ప్రజలకు పిలుపు ఇచ్చారు. చంద్రబాబువి దొంగమాటలనీ, ఆయనకు కూడా మీరు సమాధానం చెప్పాలనీ విజయమ్మ అన్నారు.  నాడు టీడీపీ హయాంలో కరువు కాటకాలు, కరెంటు బిల్లులతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రోజుల్లో వారిని ఓదార్చేందుకు రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం చేపట్టారనీ, ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం దానికి ఏమాత్రం తీసిపోలేదనీ, అందుకే ‘మరో ప్రజాప్రస్థానం’ చేపట్టాలంటూ జగన్‌బాబు జైల్లోనే రూట్‌మ్యాప్ తయారుచేసుకున్నాడని ఆమె చెప్పారు.
గత నెల 28న, ఈ నెల 5న బెయిల్ వస్తుందనుకున్నామనీ, అది జరుగకపోవడంతో ప్రజాసమస్యలపై నినదించి, వారికి ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని జగన్‌బాబు తనతో చెప్పారని విజయమ్మ వివరించారు. ఎనిమిది కోట్ల మంది ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలన్నాడనీ, కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పేందుకు ఎవరో ఒకరు జనం మధ్యన ఉండాలన్నాడనీ. మోకాళ్ల నొప్పులతో ఉన్నతాను నడవలేని పరిస్థితి కనుక ప్రజల కోసం జగన్ పడుతున్న ఆవేదన చూసి షర్మిల తాను నడుస్తానందనీ, జగన్ రాగానే ఈ పాదయాత్ర తానే చేస్తాడవీ విజయమ్మ తెలిపారు.
పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించడం కోసం ‘అమ్మ ఒడి’ పథకం ప్రవేశపెడతానంటూ జగన్ బాబు పార్టీ ప్లీనరీలో వాగ్దానం చేశాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుర్తు చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక, పిల్లలను బడికి పంపితే ఒక్కో పిల్లాడికి రూ. 500 చొప్పున తల్లి ఖాతాలో ప్రతి నెలా జమ చేస్తానన్నాడనీ, పిల్లలను పూర్తిగా ఉచితంగా చదివిస్తానన్నాడనీ, అవ్వాతాతలు మూడు పూటలా భోజనం చేసేందుకు  నెలకు రూ.700 పెన్షన్ ఇస్తానన్నాడనీ, వికలాంగుల పెన్షన్ రూ. 1,000కు పెంచుతానన్నాడనీ, రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధిగా రూ. 3 వేల కోట్ల ప్రత్యేక నిధి పెడతానన్నాడనీ ఆమె వివరించారు. రైతులు ఇది మా ప్రభుత్వం అని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి తెస్తానన్నాడనీ, ఇది జగన్ బాబు మాట అనీ ఆమె చెప్పారు. ..

Back to Top