జగన్‌పై తప్పుడు కేసులతో కుట్ర: పువ్వాడ

ఖమ్మం: తప్పుడు కేసుల ద్వారా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్.జగన్‌మోహన్ రెడ్డిని జనానికి దూరం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నాయని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. ఆయన తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... జగన్‌మోహన్ రెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికించి, జనానికి దూరం చేసేందుకు కుట్ర సాగుతోందని, సీబీఐ సాగదీత దర్యాప్తు ఇందులో భాగమేనని ధ్వజమెత్తారు. వైయస్‌ఆర్ సీపీని బలహీనపరిచేందుకు పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం కుతంత్రాలు చేస్తున్నాయని విమర్శించారు. కానీ, ఇవేవీ ఫలించవని అన్నారు. రాష్ట్రంతోపాటు జిల్లాలో వైయస్‌ఆర్ సీపీని బలమైన శక్తిగా తయారుచేసేందుకు వైయస్‌ఆర్, జగన్ అభిమానులు, పార్టీ శ్రేణులు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగన్ త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తారని, అప్పటివరకు శ్రేణులంతా పార్టీ శ్రేయస్సుకు పాటుపడాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈడీని, సీబీఐని ఉసిగొలిపి, బెయిల్ విచారణపై ప్రభావం చూపాయని విమర్శించారు. బెయిల్ వాదనలకు ముందు రోజు టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రి చిదంబరాన్ని కలిశారని, ఆ తరువాత గంటలోనే ఆస్తులను ఎటాచ్‌మెంట్ చేస్తూ ఈడీ ఆదేశాలు వెలువడ్డాయని చెప్పారు. జగన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన రోజున వైయస్‌ఆర్ అభిమానులు ఎంతగానో తల్లడిల్లారని చెప్పారు. దివంగత మహానేత వైయస్‌ఆర్ మరణించిన రోజున ఎన్నో ఇళ్లలో పొయ్యి వెలగలేదని, జగన్ బెయిల్ పిటిషన్ తిరస్కరించిన రోజు కూడా అదే జరిగిందని చెప్పారు. గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లాస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్టు అజయ్‌కుమార్ చెప్పారు. పార్టీ నిర్మాణం, పటిష్టతపై చర్చించేందుకు ఆదివారం జిల్లా నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. జిల్లావ్యాప్తంగా సుశిక్షుతులైన 40వేల మంది సభ్యులను తయారు చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనున్నట్టు చెప్పారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను జిల్లా పర్యటనకు తీసుకొచ్చి పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తామని తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top